తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకునేందుకు అమిత్ షాతో పాటు తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా వెళ్లారు. ఈ క్రమంలోనే దేవాలయం నుంచి బయటకు వచ్చిన అమిత్ షాకు ఆయన బూట్లు చేతితో పట్టుకొచ్చి మరీ బండి సంజయ్ ఇవ్వడం సంచలనం రేపింది.
మరో అడుగు వేస్తే అమిత్ షా తన బూట్లను తొడుక్కునే అవకాశం ఉన్నప్పటికీ ఇంతలోనే బండి సంజయ్ తన స్వామి భక్తి చాటుకునేందుకు బూట్లు అందించి సంబరపడిపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలను అందలం ఎక్కిప్పిస్తామని చెప్పిన బండి సంజయ్ ఇలా బీజేపీ పెద్దలకు బానిసలాగా మారారని టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ ఎపిసోడ్ పై ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. ఛీ ఛీ…ఇలాంటి నేతలా తెలంగాణను అభివృద్ధి చేసేంది అంటూ ప్రకాష్ రాజ్ ఎద్దేవా చేశారు. అమిత్ షాకు బండి సంజయ్ చెప్పులు అందిస్తున్న వీడియోను కూడా ప్రకాష్ రాజ్ జత చేస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో బండి సంజయ్ పై సోషల్ మీడియాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ట్రోలింగ్ చేస్తున్నారు.
ఒకవేళ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థిగా తనకు మించిన ప్రత్యామ్నాయం లేదని బండి సంజయ్ ఈ దెబ్బతో నిరూపించుకున్నారని ట్రోలింగ్ జరుగుతోంది. రాజకీయాల కోసం మరీ ఇంత దిగజారి పోవాలా, పదవులు కోసం మరీ ఇలాంటి పనులు చేయాలా అని విమర్శిస్తున్నారు.