2024 సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉండడంతో ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, తదితర అంశాలపై కసరత్తు ప్రారంభించాయి. అయితే, రాబోయే ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తామని వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. కానీ, మిగతా ప్రధాన పార్టీలైన టీడీపీ, బిజెపి, జనసేనల మధ్య పొత్తు వ్యవహారం ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం ఢిల్లీలో కేంద్ర హోం శాఖా మంత్రి, బిజెపి కీలక నేత అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
టిడిపితో బీజేపీ పొత్తు పెట్టుకునే వ్యవహారంపై మాట్లాడేందుకే చంద్రబాబు ఢిల్లీలో పర్యటించారని, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా చంద్రబాబు భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఇక, బిజెపి, జనసేనలు టిడిపితో పొత్తు పెట్టుకునేందుకు సుముఖంగా ఉన్నాయని వైసీపీ ఓటమే లక్ష్యంగా ఈ 3 పార్టీలు మైత్రిని కొనసాగించడానికి మొగ్గు చూపుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ పొత్తుల వ్యవహారంపై తెలంగాణ, బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పొత్తుపై వస్తున్న ఊహాగానాలలో వాస్తవం లేదని బండి సంజయ్ తేల్చేశారు. తెలంగాణలో బీజేపీ నానాటికి ఆదరణ పెరుగుతోందని, దానిని దెబ్బతీసేందుకు టీఆర్ఎస్ తో పాటు మరికొన్ని పార్టీలు కుట్ర చేస్తున్నాయని బండి ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుల హోదాలో సీఎం మమతా బెనర్జీ, సీఎం స్టాలిన్, నితీష్ కుమార్ వంటి వారు కూడా ప్రధాని మోడీతో పాటు అమిత్ షాలను కలిసిన సందర్భాలున్నాయని బండి సంజయ్ గుర్తు చేశారు..రాబోయే ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ ,టీఆర్ఎస్, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని అయినా బిజెపి గెలుపు ఖాయమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.