తెలంగాణలో టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఆ కేసులో తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను ఏ-1 గా పేర్కొనడం, ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం సంచలనం రేపింది. ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు వారం రోజుల ముందు జరిగిన బండి సంజయ్ అరెస్టు వ్యవహారం రాజకీయ కాక రేపింది. అయితే, ఈరోజు ప్రధాని మోడీ పర్యటనకు ముందు బండి సంజయ్ కు బెయిల్ లభిస్తుందా లేదా అన్న సందిగ్ధత ఏర్పడింది.
కానీ, ఎట్టకేలకు బండి సంజయ్ కు బెయిల్ లభించడంతో ఆయన ప్రధాని మోడీ పర్యటనకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ప్రధాని హోదాలో మోడీ హైదరాబాద్ కు వస్తే కేసీఆర్ ఎందుకు రాలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదని చెప్పే కేసీఆర్ తెలంగాణలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరుగుతుంటే ఎందుకు హాజరు కాలేదని నిలదీశారు.
తెలంగాణ సమాజానికి కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ కు రాష్ట్ర అభివృద్ధితో పనిలేదని, తెలంగాణను డెవలప్ చేసినందుకు కేంద్రం కట్టుబడి ఉన్నా రాష్ట్రం సహకరించడం లేదని బండి సంజయ్ ఆరోపించారు. ఈ రోజు కేసీఆర్ ఎందుకు రాలేదో చెప్పాలని ఆయన షెడ్యూల్ ఏంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కోసం ప్రత్యేకంగా ఒక కుర్చీ వేశామని, ఆయన కోసం తను చాలాసేపు ఎదురు చూశానని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ వస్తే సన్మానిద్దాం అని శాలువా తీసుకువచ్చానని వెల్లడించారు.