కొంతకాలంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, సీఎం కేసీఆర్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వైఖరిని కేసీఆర్ తప్పుబడుతున్నారు. అయితే, రాష్ట్రానిదే తప్పని సంజయ్ అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కేసీఆర్ పై సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతామని సంజయ్ వార్నింగ్ ఇచ్చారు.
ఒకసారి వరి వద్దని, మరోసారి పత్తి వద్దని, ఇంకోసారి మక్కలు వేయొద్దని రైతులను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని, కేసీఆర్ గజినీ వేషాలు మానుకోవాలని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇబ్బందులను తెలుసుకోవడానికి వెళ్తే తమపై గూండాలతో టీఆర్ఎస్ నాయకులు దాడులు చేయించారని సంజయ్ ఆరోపించారు. రాళ్ల దాడిలో 8 కార్లు ధ్వంసమయ్యాయని, దాడికి ప్రతీకారం తీర్చుకుంటానని అన్నారు.
తాను వెళ్లిన ప్రతీ గ్రామంలోనూ విద్యుత్ సరఫరాను నిలిపివేసి టీఆర్ఎస్ శ్రేణులు దాడులకు దిగాయని ఆరోపించారు. తన వాహనంపై రాళ్లు, గుడ్లతో దాడి చేశారని, రైతుల కోసం ఆ తరహా దాడులు భరిస్తానని అన్నారు. అంతేకాదు, రైతుల కోసం తన తలను 6 ముక్కలుగానైనా నరుక్కుంటానని చెప్పారు. తన పర్యటన ముందుగానే ఖరారైనా కూడా శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను తలుచుకుంటే ఏ ఒక్కరూ రోడ్ల మీద తిరగరని సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ మతతత్వ పార్టీయేనని, తాను మతతత్వ వాదినేనని సంజయ్ స్పష్టం చేశారు. 80 శాతం హిందువుల ధర్మం గురించి మాట్లాడితే మతతత్వ పార్టీ అంటున్నారని, అలా అంటే తాము చేసేదేమీ లేదని అన్నారు. ఒక వర్గానికి కొమ్మకాసే కుహనా సెక్యులర్ పార్టీలను నమ్మొద్దని సంజయ్ సూచించారు. కేసీఆర్ సర్కార్ వెంటిలేటర్‌పై ఉందని ఎద్దేవా చేశారు.