ఏపీ పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను జగన్ ఉప సంహరించుకున్న సంగతి తెలిసిందే. అయితే, కొద్ది రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలోనే జగన్ ఈ ప్రకటన చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు, ఏపీ బీజేపీ నేతలకు షా క్లాస్ పీకారని, అందుకే వారంతా అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొన్నారని చెబుతున్నారు. అమరావతిలో రాజధానిని నిర్మించేది బీజేపీనే అని సోము వీర్రాజు చేసిన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి.
ఈ క్రమంలోనే తాజాగా అమరావతి ఉద్యమ ానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంఘీభావం ప్రకటించారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కావాలంటూ…గత 22 రోజులుగా అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు సంజయ్ మద్దతు ప్రకటించారు. ఇప్పటివరకు అమరావతిపై నోరు విప్పని బండి సంజయ్ …షా పర్యటనత తర్వాత పాదయాత్రకు మద్దతివ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీ టీడీపీ నేతలు ఇప్పటికే ఉద్యమంలో పాల్గొని మద్దతు తెలపగా…బండి సంజయ్ కూడా అండగా నిలవడం అమరావతి రైతుల్లో నూతనోత్సాహం నింపింది. అంతేకాదు, బండి సంజయ్ త్వరలోనే రాజధాని రైతులను ప్రత్యక్షంగా కలిసి తన సంఘీభావం తెలపబోతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, అమరావతి రైతుల మహాపాదయాత్ర 23వ రోజుకు చేరుకుంది. నెల్లూరు జిల్లా కొండబిట్రగుంట నుంచి ప్రారంభమైన పాదయాత్ర…సున్నంబట్టి వరకు 15 కిలోమీటర్ల వరకు కొనసాగనుంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ ప్రకటనపై అమరావతి రైతులు స్పందించారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించేవరకూ ఉద్యమం ఆగదని తేల్చిచెప్పారు. కొత్త బిల్లు ప్రవేశపెట్టేవరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. జగన్ నోటి వెంట అమరావతే ఏకైక రాజధాని అని ప్రకటన వస్తేనే తాము నమ్ముతామని అన్నారు.