ఓ వైపు తెలంగాణలో కరోనా విశ్వరూపం చూపుతూ వేల కేసులు నమోదవడం కలవరపెడుతోన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందంటూ హైకోర్టు పలు మార్లు హెచ్చరించినా…ప్రభుత్వం తీరు మారడం లేదంటూ న్యాయస్థానం పలు మార్లు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉండగానే భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటోన్న తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి తొలగించడం, ఆ శాఖను కేసీఆర్ స్వయంగా తన వద్దే ఉంచుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.
కరోనాపై ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఈటల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఏ శాఖలో ఎక్కువ నిధులు ఉంటే ఆ శాఖను కేసీఆర్ తీసుకుంటారని సంజయ్ ఎద్దేవా చేశారు. కరోనా కట్టడికి కేంద్ర పభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంపై కేసీఆర్ ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతున్నారని, కరోనాకు సంబంధించిన వాస్తవాలను కూడా వెల్లడించడం లేదని విమర్శించారు.
అసలు దర్శనమే దొరకని సీఎం కేసీఆర్ చేతికి వైద్య ఆరోగ్య శాఖ వెళ్లిందని విజయశాంతి ఎద్దేవా చేశారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ కరోనా బారినపడ్డారని విమర్శించారు. ఇలాంటి సీఎం చేతిలో పడినందుకు కాపాడమంటూ “కుచ్ ‘కరోనా’ భగవాన్” అని తెలంగాణ ప్రజలు దేవుడిపైనే భారం మోపి కాలం వెళ్లబుచ్చుతున్నారనేది నేటి కఠోర వాస్తవం అని విజయశాంతి విమర్శించారు.