తెలంగాణ బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్.. కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలులో బండి సంజయ్‌ను పరామర్శించేందుకు కేంద్రమంత్రి భగవంత్ కుబ వెళ్లారు. ఆయనతో కలిసి బండి సంజయ్ బయటకు వచ్చారు. కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేపట్టిన బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బండి సంజయ్‌ను అరెస్టు చేసిన తీరును తప్పుబట్టిన హైకోర్టు.. వ్యక్తిగత పూచీకత్తుపై సంజయ్‌ను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
ఉపాధ్యాయులు, ఉద్యోగుల కోసమే తాను జైలుకు వెళ్లానని బండి సంజయ్ అన్నారు. జీవో 317 సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యాలయం ధ్వంసం చేశారని.. కార్యకర్తలపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అరెస్ట్ చేసి రాక్షసానందం పొందుతున్నారని సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. మళ్లీ జైలుకు వెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నానన్న బండి సంజయ్.. జీవో 317 సవరించినప్పుడే సంతోషిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగులకు అండగా పార్టీ ఉంటుందన్నారు. ఉద్యోగాలు పోతాయని ఉద్యోగులు భయపడవద్దని.. తిరిగి ఇప్పించే బాధ్యత తాము తీసుకుంటామన్నారు.
ప్రభుత్వం జీవో 317 సవరించినపుడే సంతోషిస్తానని బండి చెప్పారు. మరోసారి జైలుకు వెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నా. వచ్చే ఎన్నికల్లో బీజేపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగులకు బీజేపీ పూర్తి అండగా ఉంటుంది. హక్కుల కోసం ఉద్యోగులు చేసే పోరాటానికి అండగా ఉంటామన్నారు. ఉద్యోగాలు పోతే అధికారంలోకి వచ్చాక ఇప్పించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ సమాజం, రైతులు, ఉద్యోగుల కోసమే బీజేపీ పోరాడుతోందని.. ధర్మయుద్ధం ఇప్పుడే మొదలైందని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రిని అవినీతి కేసులో జైలుకు పంపే రోజులు దగ్గర పడ్డాయన్నారు. హైకోర్టు విడుదల చేయాలని ఆదేశించినా ఎన్నో రకాలుగా గంటన్నరపాటు ఒత్తిడి తెచ్చారని తెలిపారు. ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని, పోరాటం ఆగదని అన్నారు. రెండేళ్లులో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, కేసీఆర్ తన గోతిని తానే తవ్వుకుంటున్నారని బండి వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలను గమనిస్తే.. టీఆర్ ఎస్ వర్సెస్ బండి మధ్య దూకుడు మరింత పెరుగుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.