కేసీఆర్ ఒక దగాకోరు, ప్రభుత్వ వ్యవస్థల చేత ఫోర్జరీ చేశారంటే వీరు ఎంత దారుణానికి అయినా తెగిస్తారని… పదవి కోసం రాష్ట్రంలో ఎంత అస్థిరతను సాధించడానికి అయినా వెనుకాడరు అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
ఎన్నికల్లో గెలవడం కోసం ముఖ్యమంత్రి హోదాలో ఉండి నా సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ లేఖ సృష్టించినపుడే కేసీఆర్ ఓటమి అందరికీ తెలిసిపోయిందన్నారు. ఆ లేఖ నేను రాసింది కాదు అని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి ప్రమాణం చేసినా. నా సవాల్ స్వీకరించి కేసీఆర్ కూడా ప్రమాణం చేస్తారు అనుకున్నాను. కానీ అతను సవాల్ స్వీకరించలేదు. అంటే ఫోర్జరీ చేసినట్లు తప్పు ఒప్పేసుకున్నారు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
నేను తప్పు చేయలేదు కాబట్టి, వెంటనే దేవుడి వద్ద ప్రమాణానికి వచ్చాను. కేసీఆర్ తప్పు చేశాడు కాబట్టి, దొంగ లేఖ రాశాడు కాబట్టి దేవుడి వద్ద ప్రమాణం చేయడానికి భయపడ్డాడు అని బండిసంజయ్ ఆరోపించారు. ఈరోజు బండి సంజయ్ బీజేపీ ఆఫీసు నుంచి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వరకు బైకు ర్యాలీగా వెళ్లి అక్కడ ప్రమాణం చేశారు.
కేసీఆర్ నిజంగా అభివృద్ధి చేసి ఉంటే ghmc elections లో అభివృద్ధి పేరుతో ఎన్నికలకు వెళ్లాలి కానీ, ఇలాంటి తప్పుడు ప్రచారాలతో ఎన్నికలకు వెళ్లడం దారుణమని అన్నారు.
ఎంఐఎంతో చేతులు కలిపి కేసీఆర్ మత రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఈ ఎన్నికల సమయంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఎల్ఆర్ఎస్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు.