తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పాదయాత్ర తాజాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్రకు చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన భారీ సవాలును ముఖ్యమంత్రి కేసీఆర్ కు విసిరారు. గడిచిన ఎనిమిదేళ్లలో మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్ చేసిందేమిటని ప్రశ్నించారు.
పాలమూరును దత్తత తీసుకున్నట్లు కేసీఆర్ చెబుతారని.. మరి ఎనిమిదేళ్లలో పాలమూరుకు సీఎం చేసిందేమిటి? అని ప్రశ్నించిన బండి సంజయ్.. పాలమూరులో వలసలు లేవని కేసీఆర్ చెబుతున్నారని.. కానీ అది అబద్ధమని స్పష్టం చేశారు.
తాను సీఎం కేసీఆర్ కు సవాలు విసురుతున్నట్లుగా చెప్పిన ఆయన.. ‘పాలమూరులో వలసలు లేవని సీఎం కేసీఆర్ నిరూపిస్తే.. రాజకీయ సన్యాసానికి సిద్ధం. పాలమూరు నుంచి వలసలు ఇంకా ఆగలేదని నేను నిరూపిస్తాను. కేసీఆర్ నా సవాలును స్వీకరిస్తారా?’’ అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంపాదనే ముఖ్యం తప్పించి.. రాష్ట్ర సంక్షేమం అస్సలు అవసరం లేదన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. మరి.. బండి సంజయ్ చేసిన భారీ సవాలుకు సీఎం కేసీఆర్ స్వీకరిస్తారా? ఆయన ఎలా రియాక్టు అవుతారో చూడాలి.