కేసీఆర్ అదను చూసి జలవివాదం రేకెత్తించారు. తనకు అనువైన, తన చెప్పుచేతుల్లో ఉండే వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రిగా అవడానికి శతధా ప్రయత్నించి విజయవంతం అయిన కేసీఆర్ అన్ని నిబంధనలు ఖాతరు చేసి అడ్డదిడ్డంగా ఏపీ వాటా నీటిని వాడేస్తున్నాడు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి, వైసీపీ నేతలకు హైదరాబాదులో భారీ ఎత్తున వ్యాపారాలు, ఆస్తులు ఉండటం వల్ల వారు కేసీఆర్ మాటలకు ఎదురు చెప్పలేకపోతున్నారు. చివరకు సగం వాటా మాకే అని కేసీఆర్ ప్రకటించి రెండు రోజులు అయినా జగన్ నోరెత్తడం లేదు.
దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. తాజాగా సిఎం కెసిఆర్‌పై తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ సరికొత్త విమర్శలు చేసి కేసీఆర్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.
తెలంగాణ కోసం పోరాడతానని చెప్పే కేసీఆర్ 299 టిఎంసి నీటి కోసం అప్పటి పూర్వపు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఎందుకు అంగీకరించారని, అప్పటి ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, అప్పటి ఎపి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమాతో ఒప్పందం ఎందుకు కుదుర్చుకున్నారని బండి నిలదీశారు.
అంటే తెలంగాణకు జరిగిన నీటి వాటా అన్యాయానికి కెసిఆర్ మొదటి కారణం అన్నారు బండి సంజయ్. చంద్రబాబుతో వారు చేసుకున్న ఒప్పంద పత్రాలను బండి సంజయ్ మీడియాకు చూపించారు. ఆ నాడు మీ కొమ్ములు వంచి ఏపీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి భారీగా నీటి వాటా తీసుకుపోతుంటే ఎలా అంగీకరించారని, ఇపుడు ఎందుకు డ్రామాలు ఆడుతున్నారని నిలదీశారు.
పైగా ఇదే కేసీఆర్ రోజా ఇంటికి వెళ్లి ప్రత్యేక విందు ఆరగించి రాయలసీమకు నీళ్లిస్తాను అని అన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. అసలు అక్కడ ఏం జరిగిందో రోజాకు తెలుసు, ఆ రహస్య మీటింగ్ వివరాలు ఇప్పటికీ ప్రజలకు చెప్పలేదు.
ఆ సంతకాలు చేసేటపుడు కేసీఆర్ తెలివి ఎక్కడికి పోయింది అని బండి సంజయ్ నిలదీశారు. 2020 లో, అప్పుడు తెలంగాణ ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు లేఖ రాశారు, తెలంగాణకు నీటి వాటా 575 టిఎంసి అని సంజయ్ పేర్కొన్నారు. అయినా 299 టిఎంసిలకి అంగీకరిస్తూ సిఎం కెసిఆర్ ఎందుకు సంతకం చేశారు. కెసిఆర్, రజత్ కుమార్ ప్రకటనల మధ్య ఎందుకు తేడా ఉంది? అప్పటికి ఎపితో కుదుర్చుకున్న ఒప్పందంపై తాను అభ్యంతరాలు వ్యక్తం చేశానని, అయితే కెసిఆర్ లేదా టిఆర్ఎస్ ప్రభుత్వం తన అభ్యంతరాలపై స్పందించలేదని బండి సంజయ్ అన్నారు.
ఇప్పటికీ ఎప్పటికీ కేసీఆర్ కు ప్రజల మీద ప్రేమ లేదు. తమ రాజకీయ లాభాల కోసం తెలంగాణ సిఎం, ఆంధ్ర సిఎం ఇరువైపుల ప్రజలను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారు అని బండి సంజయ్ ఆరోపించారు. తన పార్టీ మనుగడ కోసం ప్రజలలో తెలంగాణ మనోభావాలను ప్రేరేపించడానికి కెసిఆర్ ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
బండి సంజయ్ సమర్పించిన ఆధారాలతో కేసీఆర్ బండారం తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది.