తెలంగాణ సీఎం కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి బహిరంగ లేఖ రాశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రకటన చేసి 15 రోజులు గడిచినా… కొనుగోలు కేంద్రాలు తెరవడం లేదని ఆరోపించారు.
తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరవాలంటూ… సీఎం కేసీఆర్కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ప్రతి గింజ కొనుగోలు చేస్తామని కేసీఆర్ ప్రకటించి పక్షం రోజులు గడుస్తున్నా…. కొనుగోలు కేంద్రాలు తెరవలేదని ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన… రైతులతో ముచ్చటించారు.
రాష్ట్రంలో 7 వేల కేంద్రాలకు 2,500 కేంద్రాలు మాత్రమే ప్రారంభించారని బండి విమర్శించారు. 60 లక్షల టన్నుల ధాన్యం కొనాల్సి ఉండగా… కేవలం 2 లక్షల టన్నులు మాత్రమే ఇప్పటివరకు కొన్నారని చెప్పారు. కొనుగోలు సాగకపోవడం వల్ల కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులు, కల్లాల్లో ధాన్యం ఆరబోసుకున్న రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని గుర్తు చేశారు. అవసరమైన గోనెసంచులిచ్చి, కొన్నధాన్యానికి వెంటనే చెల్లించాలని కోరారు.
అకాల వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలుకయ్యే ఖర్చు కేంద్రమే చెల్లిస్తున్నందున రాష్ట్రప్రభుత్వం అలసత్వాన్ని చూపకుండా ధాన్యంకొనుగోలు యుద్ధప్రాతిదికన చేపట్టాలన్నారు. ప్రతిగింజ కొనేవరకు, రైతుల డబ్బులు చెల్లించే వరకూ రైతుల పక్షాన బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ అవినీతిని తాము త్వరలోనే వెల్లడిస్తామని.. మరో సంచలన వ్యాఖ్య చేశారు. మొత్తానికి బండి వ్యాఖ్యలు మరోసారి వివాదంగా మారాయి.