తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కాస్త ఆవేశం ఎక్కువ. ఇప్పుడున్న రాజకీయాల్లో ఎవరికి ఉండదని సరిపెట్టుకోవచ్చు. కానీ.. ఆయనకు మరో సిత్రమైన అలవాటు ఉంది. ఆయన మాటలు ఘాటుగా ఉంటాయి. కానీ.. వాటిల్లో ఉండాల్సినంత దమ్ము ఉండదు.
తెలంగాణ ప్రజలు ఉత్తినే మాటలు చెప్పినంతనే ఊరుకోరు. ఉత్తినే నమ్మేయరు. ఆధారాలు చూపించాలి. సాక్ష్యాలు చెప్పాలి. అప్పుడు మాత్రమే వారు సమాధానపడతారు. అంతే తప్పించి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే.. ఓకే అనేసి ఓట్లు వేసే అలవాటు తమకు ఉండదన్న విషయాన్ని జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత జరిగిన ఎన్నికల్లో చెప్పేశారు.
దుబ్బాక.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుపులు మెరిపించిన బీజేపీ.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బొక్క బోర్లా పడటానికి కారణం ఏమిటన్నది చూసుకోకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడే బండి సంజయ్.. ఇప్పుడా పార్టీకి మైనస్ గా మరారాన్న మాట వినిపిస్తోంది.
ఇప్పటికే తెలంగాణ బీజేపీలో అంతర్గతంగా లొల్లి షురూ అయ్యింది. పార్టీకి ఎప్పటి నుంచో నమ్మకస్తులుగా ఉన్న పెద్దలకు.. ఇటీవల కాలంలో లైమ్ లైట్ లోకి వచ్చిన వారికి మధ్య అంతరాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయన్న మాట వినిపిస్తోంది. ఇలాంటప్పుడు అందరిని కలుపుకుపోవటం చాలా అవసరం.
కానీ.. బండి సంజయ్ అలాంటివేమీ పట్టించుకోరన్న మాట వినిపిస్తోంది. ఇంట్లో ఈగల మోత మోగుతున్న వేళ.. దాన్ని ఒక కొలిక్కి తీసుకురాకుండా తెలంగాణ అధికారపక్షం మీద.. ముఖ్యమంత్రి మీద ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లటం ఖాయమని.. ఆయన్ను ఎప్పుడు జైలుకు పంపించాలనే దానిపై తమ వ్యూహం తమకుందన్నారు. టీఆర్ఎస్ మంత్రులు.. ఎమ్మెల్యేల అవినీతి వివరాల్ని పూర్తిగా సేకరించామని.. 18 మంది ముఖ్యనేతలపై లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్లు చెప్పారు.
సీఎం కేసీఆర్ సహారా.. ఈఎస్ఐ స్కాంల్ని చూశాక ఆయన ఎంత పెద్ద అవినీతిపరుడో తమకు తెలిసిపోయిందన్నారు. ఇలాంటి విమర్శలు చేయటం బాగానే ఉన్నా.. సీఎం కేసీఆర్ ను జైలుకు ఎప్పుడు పంపాలన్న దానిపై తమకు వ్యూహం ఉందనన మాటలపై బీజేపీ నేతలే విస్మయానికి గురవుతున్నారు.
తప్పు చేసిన వారిని.. తప్పు చేసినట్లుగా నిరూపించే ఆధారాలు చూపించాలి.అదేమీ లేకుండా నోరు తెరిచిన ప్రతిసారీ జైలుకు పంపుతామంటూ మాట్లాడటంలో అర్థం లేదంటున్నారు. ఇలా టార్గెట్ చేసి మరీ జైలుకు పంపుతామని చెప్పటం సెల్ఫ్ గోల్ గా అభివర్ణిస్తున్నారు.
ముఖ్యమంత్రిగా ఉన్న అధినేతనున ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసే వేళ.. ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించటం అవసరమని.. అదేమీ లేకుండా మాట్లాడుతున్న బండి మాటల్ని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.