తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రస్థానం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చిత్తశుద్ధితో పనిచేసేవారికి బీజేపీ ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందనడానికి బండి పెద్ద ఉదాహరణ. చిత్తశుద్ధితో పాటు ప్రజాబలం కూడా ఉంటే బీజేపీలో ఏ స్థాయికైనా ఎదగొచ్చనడానికీ ఆయన ఉదాహరణే. తెలుగు రాష్ట్రాల్లో సైద్ధాంతికంగా, ప్రజాబలం పరంగా కూడా శక్తిమంతమైన అతికొద్ది మంది బీజేపీ నాయకుల్లో బండి సంజయ్ ఒకరు.
ఇంకా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన బీజేపీ నేతలు గతంలో ఉన్నప్పటికీ వారిలో ప్రజాబలం ఉన్నవారిని వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఏ పార్టీ సహాయం లేకుండా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన బీజేపీ నేతలనూ వేళ్లపై లెక్కపెట్టొచ్చు. తెలంగాణ విషయానికొస్తే ఆలె నరేంద్ర, కిషన్ రెడ్డి, దత్తాత్రేయ తరువాత ఆ స్థాయిలో రాష్ట్రవ్యాప్త ఆదరణ, ఫాలోయింగ్ దూకుడు ఉన్న నేతగా బండి సంజయ్ కనిపిస్తున్నారు.
రాజాసింగ్ వంటి నేతలకూ ప్రజాదరణ ఉన్నప్పటికీ కేంద్రంలో ఆయనకు పట్టు లేదు. సంజయ్ విషయానికొస్తే ఎంపీ కాకముందు నుంచి కూడా కేంద్రంలో కొంత పట్టున్నప్పటికీ ఎంపీ అయిన తరువాత ఆయన తన గ్రిప్ మరింత పెంచుకున్నారు.
క్షేత్ర స్థాయిలో సంజయ్ ఎంత దూకుడుగా ఉంటారో పార్టీ విషయానికొచ్చేసరికి అధినాయకత్వానికి అంత అనుకూలంగా ఉంటారు. క్షేత్ర స్థాయి విషయాలు, వాస్తవాలు అధిష్ఠానానికి ఉన్నదున్నట్లు చెప్తారని పేరుంది ఆయనకు.
తెలంగాణలో జాతీయ కార్యవర్గంలో గతంలో ఉన్న నాయకులు క్షేత్ర స్థాయిలో తమ బలం చూపించుకోలేకపోగా సంజయ్ అందుకు విరుద్ధంగా పాలక టీఆరెస్‌కు చెమటలు పట్టిస్తున్నారు. తలపండిన నాయకులున్న కాంగ్రెస్ పార్టీ చేయలేని పనిని బండి సంజయ్ తెలంగాణలో చేస్తున్నారు. సీఎం కేసీఆర్, పాలక టీఆరెస్ తెలంగాణలో ఎవరికైనా భయపడుతున్నారంటే అది బండి సంజయ్కేనని చెప్పాలి. కేసీఆర్‌కు ఏమాత్రం కొరుకుడపడని టఫ్ నట్‌గా మారారు బండి.
ప్రశ్నించే ప్రతి గొంతునూ నొక్కేసిన టీఆరెస్ ప్రభుత్వం బండిని మాత్రం ఏమీ చేయలేకపోతోంది. నిత్యం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ దూసుకెళ్తున్న బండి అటు దిల్లీలోనూ తన మాట నెగ్గించుకుంటున్నారు.
తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న కిషన్ రెడ్డితో మంచి సాన్నిహిత్యం నెరుపుతూ, రాం మాధవ్ వంటి తెలుగు బీజేపీ అగ్రనేతలు, ఇతర బీజేపీ పెద్దల వద్దా గుర్తింపు పొందిన బండి సంజయ్ మొన్నటి జాతీయ కార్యవర్గంలో తన వర్గానికి చోటు దక్కేలా చేయడంలో సఫలమయ్యారు.
బండి సంజయ్ మాట ప్రకారమే మరో ఫైర్ బ్రాండ్ లీడర్ డీకే అరుణను బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారని దిల్లీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అంతేకాదు..ఏపీలో బీజేపీతో కలిసి నడుస్తున్న పవన్ కల్యాణ్ సైతం బండి సంజయ్ పని తీరుకు ఫిదా అయిన సందర్భాలున్నాయి.
ప్రధాని మోదీ కారణంగా దేశవ్యాప్తంగా ప్రజల్లో మంచి అనుకూలత సంపాదించుకున్న బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో ఎంతోకొంత అవకాశాలున్నప్పటికీ ఛరిష్మాటిక్ లీడర్లు లేని కొరత చాలాకాలంగా వేధిస్తోంది. ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి ఆ లోటు తీరిందనే అంటున్నాయి రాజకీయవర్గాలు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసి అక్కడికి కొద్ది నెలల్లోనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయం సాధించి, ఆ తరువాత తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కూడా దక్కించుకుని తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పిన బండి సంజయ్ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అద్భుత ఫలితాలు రాబడతారని దిల్లీ పెద్దలు నమ్ముతున్నారు. తెలుగు రాష్ట్రాల బీజేపీలో ప్రస్తుతం మాస్ లీడర్‌గా ఎదిగిన బండి ఆ నమ్మకాన్ని నిలబెట్టే అవకాశాలను కొట్టిపారేయలేం.