తమిళ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డేల కాంబోలో తెరకెక్కిన ‘బీస్ట్’ సినిమా ఏప్రిల్ 13న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు, ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. విజయ్ ఫ్యాన్స్ తో పాటు కోలీవుడ్ సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బీస్ట్ టీమ్‌కు షాక్ తగిలింది.
తమిళనాడులో ఈ సినిమాకు నిరసన సెగ తగిలింది. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ రాష్ట్ర హోం శాఖ కార్యదర్శికి తమిళనాడు ముస్లిం లీగ్ లేఖ రాసింది. ముస్లింలను తమిళనాడు చిత్ర పరిశ్రమ ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తోందని తమిళనాడు ముస్లిం లీగ్ అధ్యక్షుడు ముస్తఫా ఆ లేఖలో ఆరోపించారు. ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ సినిమాలు నిర్మించడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
బీస్ట్ ట్రైలర్‌ను బట్టి చూస్తే ఒక షాపింగ్ మాల్ ను టెర్రరిస్టులు అటాక్ చేయగా.. సైనికుడైన హీరో వారిని ఎదురించి ప్రజలను ఎలా కాపాడుతాడు అనేది కథ. టెర్రరిస్ట్ ల నేపథ్యంలో సాగే కథ కావడంతో కువైట్ లో ఆల్రెడీ ఈ సినిమాను బ్యాన్ చేశారు. అంతకుముందు దుల్కర్ సల్మాన్ నటించిన ‘కురుప్’ చిత్రం కూడా కువైట్‌లో విడుదల కాలేదు. అరబిక్ దేశాలు ముస్లింలను ఉగ్రవాదులుగా చూపించడానికి ఇష్టపడవు. అందుకే కొన్ని అరబిక్ దేశాలు ఉగ్రవాదుల కథాంశంతో ఉండే సినిమాల విడుదలకు అంగీకరించవు. మరి, ఈ వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.