బాలినేని శ్రీనివాసరెడ్డిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని రాజకీయ నేత. వైసీపీకి చెందిన నేతల్లో.. అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఆయన పేరును ప్రస్తావిస్తుంటారు. వాసన్నగా అందరికి సుపరిచితుడైన బాలినేని ప్రత్యేకత ఏమంటే.. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆయన్ను అభిమానిస్తుంటారు. వైసీపీలో ఉన్న కొందరు మంచి నేతలు అని చెబుతూ.. ఆయన పేరును ప్రస్తావిస్తుంటారు. అలాంటి ఆయన్ను మంత్రి పదవి నుంచి పక్కన పెట్టేసిన జగన్ నిర్ణయం అప్పట్లో సంచలనంగా మారింది.
వైసీపీ అన్నంతనే నిప్పులు చెరిగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం.. బాలినేని శ్రీనివాసరెడ్డిని మంచి వ్యక్తిగా పేర్కొంటూ.. ఆయన్ను తాను ఎంతగానో అభిమానిస్తానని చెప్పటం కనిపిస్తుంది. అలాంటి బాలినేని నోటి నుంచి తాజాగా వచ్చిన ఒక మాట ఆసక్తికరంగానే కాదు సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి జగన్ తీరు ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.
జగన్ కు తానెంత దగ్గరైనప్పటికీ.. అధినేత నోటి నుంచి మాట వస్తే.. తాను తూచా తప్పకుండా పాటిస్తానన్న కమిట్ మెంట్ ను ఆయన స్పష్టం చేసినప్పటికీ.. ఆయన మాటలు మరోలా ప్రచారం కావటం గమనార్హం. ప్రకాశం జిల్లా టంగుటూరులో కొండపి వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్మన్.. డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. దీనికి బాలినేని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
గతంలో మార్కెట్ యార్డు ఛైర్మన్లుగా పురుషులే అధికంగా ఉండేవారిని.. ఎక్కడో ఒకరో ఇద్దరు మాత్రమే మహిళలు ఎన్నికయ్యేవారన్నారు. అయితే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఈ కారణంగానే ఛైర్ పర్సన్ గా శారదను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ గా వెంకాయమ్మ.. ఒంగోలు మేయర్ గా సుజాత ఎన్నిక కావటం చూస్తే.. పార్టీలో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటన్నది అర్థమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో ఆయన నవ్వుతూ ఒక కీలక వ్యాఖ్య చేశారు. రేపు జగన్మోహన్ రెడ్డి.. ‘‘వాసన్నా ఎమ్మెల్యే సీటుకు మీరొద్దు.. శచీదేవిని (బాలినేని సతీమణి) నిలబెదామని అన్నా నేను చేయగలిగింది ఏమీ లేదు’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నిజానికి బాలినేని నోటి నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు నవ్వుతూనే చేసినప్పటికీ.. జగన్ ఒకసారి ఫిక్సు అయితే వాటికే కట్టుబడి ఉంటారన్నదానికి తాజా వ్యాఖ్య నిదర్శనమని చెబుతున్నారు. అంతేకాదు.. జగన్ తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా.. దాని కారణంగా తనకు ఎంత ఇబ్బంది ఎదురైనా.. పార్టీకి కట్టుబడి ఉంటానన్న విషయాన్ని బాలినేని స్పష్టం చేశారని చెప్పక తప్పదు.