మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రజలకు సూపర్ ఆఫర్ ఇచ్చారు. తనకు సినీరంగంలో పెట్టుబడులు ఉన్నట్లు ఎవరైనా నిరూపిస్తే తన ఆస్తి మొత్తం రాసిచ్చేస్తానన్నారు. దీంతో ఆయన పెట్టుబడులు, పైకి తెలియని వ్యాపారాల గుట్టుమట్లు తెలిసిన సన్నిహితులు, దగ్గరి అనుచరులు మొత్తం అక్కర్లేదు కానీ ఒక 10 పర్సంట్ ఇచ్చినా చాలు మీకు సినిమాలలో పెట్టుబడులు ఉన్న విషయం చెప్పేస్తాం అంటూ సరదాగా అంటున్నారట.
సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలో పెట్టుబడులు ఉన్నాయంటూ జనసేన కార్పొరేటర్ చేసిన ఆరోపణలపై మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. తనతోపాటు తన వియ్యంకుడు భాస్కరరెడ్డికి కూడా పెట్టుబడులు ఉన్నాయంటూ ఐటీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడాన్ని తప్పుబట్టారు. సినీ పరిశ్రమలో తానూ, తన వియ్యకుండు రూపాయి కూడా పెట్టుబడులు పెట్టలేదని ఆయన చెప్తున్నారు. తాను రూపాయి పెట్టుబడి పెట్టునట్లు నిరూపిస్తే తన ఆస్తి మొత్తం రాసిస్తానని బాలినేని సవాల్ విసిరారు. అంతేకాదు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని. తనపై ఆరోపణలు చేసిన జనసేన నేత ఇందుకు సిద్ధమా అని బాలినేని శ్రీనివాసరెడ్డి ఛాలెంజ్ చేశారు. ఇకనైనా దుష్ప్రచారాలు మానుకోవాలని బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించారు. జనసేన కార్పొరేటర్ చేసిన ఆరోపణలపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరా తీసుకోవచ్చని బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
కాగా మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై విశాఖకు చెందిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బినామీ, ఆయన వియ్యంకుడు భాస్కరరెడ్డి, వైసీపీ నేత, ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు పెట్టుబడులు ఉన్నాయని, వాటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సదరు నిర్మాణ సంస్థ అక్రమాస్తులు, లావాదేవీల వెనుక తెలంగాణకు చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయనకు సన్నిహితుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి హస్తం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
మూర్తి యాదవ్ ఆరోపణలపై తలసాని శ్రీనివాస యాదవ్ నోరెత్తకుండా కామ్‌గా ఉన్నప్పటికీ బాలినేని మాత్రం సవాళ్లు విసిరారు. అయితే, బాలినేని ఆస్తులు, వ్యాపారాలు, సరదాలు, షోకులు, పరిచయాలు, ఫ్రెండ్షిప్పులు, అలవాట్లు తెలిసినవారు మాత్రం ఆయనకు సినిమావాళ్లలో టచ్ లేకపోవడం ఏంటి.. టచ్ ఉన్నాక పెట్టుబడులు లేకపోవడం ఏంటీ అంటున్నారు. మరి.. బాలినేని ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన పెట్టుబడుల విషయం ఎవరైనా నిరూపిస్తారో లేదో చూడాలి.