మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీల వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతోందంటూ వైసీపీ నేత సుబ్బారావు గుప్తా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సుబ్బారావుపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు దాడి చేయడం, ఆ వీడియో వైరల్ కావడం కలకలం రేపింది. సుబ్బారావు గుప్తాను మోకాళ్లపై కూర్చోబెట్టి మంత్రి బాలినేనికి వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పించారు.
అయితే, తాను తన అనుచరులను వారించానని, దాడి చేయొద్దని ఫోన్ చేసి చెప్పానని బాలినేని వివరణనిచ్చే ప్రయత్నం చేశారు. కానీ, మంత్రికి తెలియకుండా ఆయన అనుచరుడు సుభానీ…గుప్తాపై దాడి ఎలా చేస్తారని ఆర్యవైశ్య నేతలు మండిపడుతున్నారు. ఆ దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్యులు ఆగ్రహం వ్యక్తం చేసి నిరసన తెలిపారు. గుప్తాకు సంఘీభావంగా పలువురు ఆర్యవైశ్యులు కొద్ది గంటలపాటు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు.
సుభానీ క్షమాపణ చెబుతూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే నిరాహార దీక్షకు దిగుతామని ఆర్యవైశ్యులు హెచ్చరించారు. కానీ, గుప్తాపై దాడి కేసులో సుభానీని పోలీసులు అరెస్ట్ చేయలేదు. థూథూమంత్రంగా కేసు పెట్టి చేతులు దులుపుకున్నారు. ఈ క్రమంలోరనే గుప్తాను మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి విజయవాడ తీసుకెళ్లారు. జగన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న బాలినేని…తనతోపాటు గుప్తాను తీసుకువెళ్లారు.
అంతేకాదు, గుప్తాకు బాలినేని కేక్ కూడా తినిపించారు. దీంతోపాటు, బాలినేని తనకు అండగా ఉంటానన్నారని, పోలీసులు రక్షణ కల్పిస్తారని హామీ ఇచ్చారని గుప్తాతో చెప్పించారు. జై జగన్, జై బాలినేని, వర్ధిల్లాలి జగన్ నాయకత్వం అంటూ సుబ్బారావు నినాదాలు చేయడం చర్చనీయాంశమైంది. నిన్న దాడి చేసిన వైసీపీ నేతలు..ఈ రోజు కేక్ తినిపిస్తున్నారని, ఇదంతా నాటకం అని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. బాలినేని అనుచరుల తీరుపై విమర్శలు రావడంతోనే ఇలా చేశారని కామెంట్లు పెడుతున్నారు. గుప్తాతో బాలినేని కొత్త డ్రామా అని…ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.