వచ్చేఎన్నికల్లో ఒంగోలు ఎంఎల్ఏ బాలినేని శ్రీనివాసుల రెడ్డికి టికెట్ దక్కదనే చాలామంది అనుకున్నారు. కారణం ఏమిటంటే బాలినేని వ్యవహార శైలితో జగన్మోహన్ రెడ్డి బాగా విసిగిపోయినట్లు వార్తలు రావడం. చీటికి మాటికి పార్టీమీద అలగటం, నోటికొచ్చినట్లు మాట్లాడటం, పరోక్షంగా జగన్ పైన కూడా వాగ్బాణాలు సంధించటం అందరు చూస్తున్నదే. దాంతో జగన్ వెంటనే బాలినేనిని పిలిపించటం బుజ్జగించటం పార్టీలో మామూలైపోయింది. అయితే జగన్ ఎన్నిసార్లు బుజ్జగించేకొద్దీ బాలినేని అలగటాలు ఎక్కువైపోతున్నాయి. దాంతో చాలామంది లాగే జగన్ కు కూడా బాలినేనంటే చిర్రెత్తినట్లుంది.
అందుకనే గడచిన రెండు సార్లు బాలినేని అలిగినా జగన్ పట్టించుకోలేదు. పార్టీలో తనతో తలనొప్పులు పెరిగిపోతున్నాయని జగన్ ఫీలయ్యారట. అందుకనే బాలినేని పార్టీలో ఉంటారు లేకపోతే పోతారనే నిర్ణయానికి జగన్ వచ్చేసినట్లు పార్టీలో టాక్ వినిపించింది. స్వయాన తన బావ అయిన మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో పడని కారణంగా పార్టీలో బాలినేని కంపు చేస్తున్నారు. వైవీతో పడకపోతే ఆ విషయం వైవీతోనే తేల్చుకోవాలి కాని మధ్యలో అలగటాలు, పార్టీని కంపుచేయటాలు వద్దని కొందరు సీనియర్లు చెప్పినా వినలేదు.
అందుకనే బాలినేని వైఖరితో విసిగిపోయిన జగన్ వచ్చేఎన్నికల్లో అసలు టికెట్ ఇచ్చేది కూడా అనుమానమే అనే ప్రచారం పెరిగిపోయింది. ఇదే సమయంలో బాలినేని జనసేన నేతలతో చర్చలు జరుపుతున్నారనే ప్రచారం పెరగటంతో చాలామంది వైసీపీ నేతలు పార్టీకి పట్టిన దరిద్రం వదిలిపోయిందనే అనుకున్నారు. అయితే తర్వాత ఏమైందో ఏమో బాలినేని చాలా రోజులు సైలెంట్ అయిపోయారు. అలాంటిది ఇపుడు తాను రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఒంగోలు నుండే పోటీచేస్తున్నట్లు ప్రకటించారు.
తన నియోజకవర్గంలో 25 వేలమంది పేదలకు ఇళ్ళపట్టాల పంపిణీకి అవసరమైన నిధులు అడిగితే నాలుగు రోజుల్లో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. జనవరి లేదా ఫిబ్రవరిలో 25 వేలమంది పేదలకు పట్టాల పంపిణీ జరుగుతుందని ప్రకటించారు. బాలినేని ప్రకటన చూసిన తర్వాత తెరవెనుక ఏమి సర్దుబాటు జరిగిందో తెలీదుకానీ ఒంగోలులో బాలినేనే పోటీచేస్తారన్న విషయం మాత్రం ఖాయమైంది. మరి గెలుపు ఓటములు ఎలాగుంటాయో చూడాలి.