మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రావు వ్యవహార శైలిపై కొద్ది రోజులుగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో విభేదాలు, మంత్రి పదవి దక్కకపోవడం వంటి కారణాలతో జగన్ కు బాలినేనికి గ్యాప్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ సారి బాలినేనికి టికెట్ ఇచ్చే ఉద్దేశ్యం జగన్ కు లేదని, ఇక, సొంత ఇలాకాలో పార్టీలో వర్గ పోరుతో బాలినేని ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని టాక్. వైవీ, బాలినేనిల మధ్య రాజీకి జగన్ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని వినికిడి.
దీంతో, జగన్ ను తాము అభిమానిస్తున్నా…ఆయన తమను అభిమానించడం లేదంటూ బాహాటంగానే బాలినేని చేసిన విమర్శలు సంచలనం రేపాయి. ఈ క్రమంలోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తర్వాత బాలినేని రాజీనామా లిస్ట్ లో ఫస్ట్ ఉన్నారని టాక్ వచ్చింది. ఇటువంటి పరిణామాల నడుమ బాలినేని తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా భారీ అనుచర గణం, అభిమానులతో బల ప్రదర్శన చేయడం సంచలనం రేపుతోంది.
వాస్తవానికి గత పదేళ్లుగా బాలినేని బర్త్ డేలు జరుపుకోవడం లేదు. అయితే, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పుట్టిన రోజు జరుపుకొని జగన్ కు తన ‘బల’ ప్రదర్శన చేశారన్న ప్రచారం జరుగుతోంది.
ఇక, 2024లో ఒంగోలు నుంచే పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని బాలినేని ధీమా వ్యక్తం చేయడం విశేషం. అంతేకాదు, వైవీ ఆశిస్తున్న ఒంగోలు ఎంపీ సీటు మాగుంటదేనని బాలినేని కన్ ఫమ్ చేయడం కొసమెరుపు. 3 నెలల్లో తమ కాంబినేషన్లో ఎన్నికలకు వెళతానని బాలినేని చెప్పారు. ప్రజల కోసం తపించే క్రమంలో కుటుంబం కోసం ఆలోచించలేదని, తన కుమారుడికి కూడా ఏమీ చేసుకోలేకపోయానని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ చెప్పకుండానే తన టికెట్, మాగుంట టికెట్ కన్ ఫమ్ అంటూ బాలినేని ప్రకటనలు, ఇటీవలి కాలంలో ఆయన వ్యాఖ్యలు నేపథ్యంలో జగన్ రియాక్షన్ ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ జగన్ టికెట్ ఇవ్వకుంటే బాలినేని ఏం చేస్తారు అన్నది కూడా ఆసక్తి రేపుతోంది. అయితే, బాలినేని టీడీపీ, బీజేపీ, జనసేనలోకి వచ్చే చాన్స్ దాదాపుగా లేదు కాబట్టి…వైసీపీ తప్ప వేరే ఆప్షన్ ఆయనకు లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.