తాజా మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిపై టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది.
మంత్రిగా ఆయన తన పదవీ కాలం.. మూడేళ్లలో 17 వందల 34 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ కొండపి నియోజకవర్గం ఎంఎల్ఏ డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి ఆరోపించారు.
రాష్ట్రం మొత్తం జే-ట్యాక్స్ వసూలు చేస్తుంటే.. ప్రకాశం జిల్లాలో బాలినేని పేరిట “బి-ట్యాక్స్” పేరిట దండుకున్నారని ధ్వజమెత్తారు.
విద్యుత్ శాఖతో పాటు ప్రకాశం జిల్లాలో గ్రానైట్ కంపెనీలు, ఇసుక, భూ అక్రమాలు, ఉద్యోగుల బదిలీలు సహా అనేక మార్గాల్లో అక్రంగా ఆర్జించారని ఓ నివేదిక బయటపెట్టారు.
అవినీతిలో మునిగి పోయిన మంత్రి విద్యుత్ శాఖను నిర్లక్ష్యం చేయడం వల్లే.. రాష్ట్రంలో అంధకారం అలుముకుందని డోలా విమ ర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పవర్ హాలీడేలు అమలు చేయడానికి ఈ అవినీతే కారణమని అన్నారు.
మంత్రిని అన్ని కోణాలలో నూ విచారించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర అధికారులు.. పోలీసుల విఛారణ కాదని.. సీబీఐ వేయాలని అన్నారు. ప్రతి పనిలో నూ.. క్విడ్ ప్రోకో..కు పాల్పడ్డారని.. మాజీ మంత్రి బాలినేనిపై తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణమైన మాజీ మంత్రి.. ప్రజలకు ముందుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ విషయాన్ని తాము న్యాయ స్థానాల దృష్టికి కూడా తీసుకువెళ్తామన్నారు.
జగన్ పదవి పోవడం ఖాయం
అపరిపక్వ, అవినీతి పాలనతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన సీఎం జగన్.. పదవీచ్యుతుడు కావడం ఖాయమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
మంత్రివర్గాన్ని మార్చుకునే హక్కు, అధికారం ముఖ్యమంత్రికి ఉన్నప్పటికీ.. అందరినీ మార్చేయడం వల్ల రాష్ట్రానికి, ప్రజలకు ఏ విధంగానూ ఉపయోగం ఉండదన్నారు.
ధరల మంట, విద్యుత్ కోతలు, ఆర్థిక సంక్షోభం, సహజ వనరుల దోపిడీ, దౌర్జన్యాలు, అక్రమ కేసులు లాంటి ప్రజా సమస్యల పరిష్కరానికి ఎంతమాత్రం దోహదం చేయదన్నారు.
అవినీతి ఊబిలో కూరుకుపోయిన జగన్ ప్రభుత్వం ఇప్పటికే పతనం అంచున ఉందని.. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ లాంటివి ఈ పరిస్థితిని మార్చలేవని యనమల అన్నారు.
కొందరు మంత్రులపై అవినీతి ఆరోపణలు, మరికొందరిపై క్రిమినల్ కేసులు ఉన్నందున రాజీనామాలు కోరుతున్నారా అని యనమల నిలదీశారు.
పదవీచ్యుతులైన మంత్రులు అసభ్య భాషతో చెలరేగిపోయినా సీఎంను సంతృప్తిపరచలేకపోయారని.. కొత్త మంత్రివర్గ సభ్యుల నుంచి మరింత అసహ్యకర పదజాలాన్ని జగన్ కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు.