తరచూ చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఉడికిపోతున్న ఏపీ మాజీ మంత్రి.. ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి (వాసు) తాజాగా తనలోని ఆగ్రహాన్ని రాజ్యసభ సభ్యుడు విజయసాయికి చూపించారా? అంటే.. అవునన్న మాట వినిపిస్తోంది. వైసీపీ నిర్వహిస్తున్న సాధికార బస్సు యాత్ర సందర్భంగా విజయసాయి నోటి నుంచి వచ్చిన తాజా మాట.. ప్రకాశం జిల్లా పార్టీలో కొత్త చిచ్చు రేపినట్లుగా చెబుతున్నారు. యాత్ర సందర్భంగా వచ్చే ఎన్నికల్లో మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి పోటీ చేస్తారంటూ చేసిన ప్రకటన కొత్త లొల్లికి కారణమైంది.
అసలేమైదంటే..
అధికార వైసీపీ నిర్వహిస్తున్న ‘సాధికార బస్సు యాత్ర’ ప్రకాశం జిల్లాలోని మర్కాపురంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డితో పాటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇతరులు హాజరయ్యారు. నిజానికి మార్కాపురం కార్యక్రమానికి విజయసాయి.. బాలినేని ఇద్దరూ ఒకే కారులో వెళ్లారు. శామ్యూల్ జార్జి కాలేజీ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన విజయసాయి.. తన ప్రసంగంలో సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి పోటీ చేస్తారని.. ఆయన్ను ఆశీర్వదించాల్సిందిగా పార్టీ అంతరంగికులతో చెప్పిన వైనంపై బాలినేని గుర్రుగా ఉన్నారు.
తనతో మాట వరసకు చెప్పుకుండా.. నేరుగా సభలో ఎలా ప్రకటిస్తారన్నది ప్రశ్నగా మారింది. మంగళవారం జరిగిన ఈ పర్యటన అనంతరం బుధవారం కనిగిరిలో నిర్వహించే కార్యక్రమానికి వెళ్లే ముందు బాలినేని ఇంటికి వెళ్లారు విజయసాయి. ఈ సందర్భంగా విజయసాయి మీద తీవ్ర అసహనాన్ని బాలినేని వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన సమీక్షలో జిల్లాపై పెత్తనం తనకు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు తనకేమీ చెప్పకుండా.. తనతో మాట్లాడకుండా పార్టీ అభ్యర్థిత్వాన్ని ఏకపక్షంలో ఎలా ప్రకటిస్తారు? అంటూ విజయసాయిని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
మంగళవారం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బుధవారం నిర్వహించే కనిగిరి బస్సు యాత్రకు తాను రాలేనని తేల్చిన బాలినేని.. అందుకు తగ్గట్లే సదరు కార్యక్రమానికి దూరంగా ఉండటం గమనార్హం. తన ఇంటికి వచ్చిన విజయసాయిని ఉద్దేశించి బాలినేని కఠిన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ‘నేను కనిగిరి బస్సు యాత్రకు రాను. మీ పని మీరు చూసుకుంటే.. ఒంగోలులో నా పనేదో నేను చూసుకుంటా’ అని వ్యాఖ్యానించినట్లుగా సమాచారం. ఈ వాదనకు బలం చేకూరేలా బాలినేని.. కనిగిరి యాత్రకు దూరంగా ఉన్నారు. ఆయనతో పాటు.. మార్కాపురం సీటును ఆశిస్తున్న ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి సైతం కనిగిరి సభకు దూరంగా ఉండటం గమనార్హం.