తరచూ వార్తల్లోకి వస్తున్న మాజీ మంత్రి బాలినేని వ్రీనివాసరెడ్డి మరోసారి తన తీరుతో హాట్ టాపిక్ గా మారారు. అధికార పార్టీలోనే కాదు ఆయన తీరు విపక్షాల్లోనూ తరచూ చర్చగా మారుతోంది. గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో ఆయన మాటల్లోనూ.. చేతల్లోనూ కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. చేసే పని ఏదైనా క్లారిటీగా చేయాల్సిన దానికి బదులుగా వ్యవహరిస్తున్న ధోరణి ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ఆయన.. ప్రధాన గేటువరకు వచ్చి.. సీఎంను కానీ.. సీఎం క్యాంప్ఆఫీసులోని వారిని కానీ కలవకుండానే వెనుదిరిగిన వైనం చర్చగా మారింది. కారు దిగకుండా.. ప్రధానగేటువరకు ఎందుకు వచ్చినట్లు? అన్నది ప్రశ్నగా మారింది. ఒకవేళ ముందస్తు అపాయింట్ మెంట్ లేకుండా వచ్చారా? అంటే.. అలా రావటం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉందన్నది బాలినేనికి తెలీదా? అన్నది ఇంకో క్వశ్చన్.
ఒంగోలు నుంచి అంత పెద్ద కాన్వాయ్ లో తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం ప్రధాన గేటు వద్ద వరకు వచ్చి.. లోపలకు వెళ్లకుండా.. కనీసం కారు దిగకుండా వెనక్కి వెళ్లిపోయిన వైనం ఇప్పుడు తాజా హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కాలంలో బాలినేని ఎప్పుడేం మాట్లాడతారో.. ఎలా వ్యవహరిస్తారన్నది అంతుచిక్కనిదిగా మారింది. సోమవారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన పలువురు వైసీపీ నేతలు.. సీఎం కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్నారెడ్డిలను కలిసి మాట్లాడి వెళ్లారు. మరి.. అందరి మాదిరి బాలినేని ఎందుకు చేయలేదు? ఎందుకు తిరిగి వెళ్లిపోయారన్నది కోటి రూకల ప్రశ్నగా మారింది. తన తాజా తీరుకు బాలినేని తన మాటలతో ఏమైనా సమాధానాలు ఇస్తారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.