జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌కు చేనేత చాలెంజ్ విసిరారు.
చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన ఈ చాలెంజ్ చేశారు. బాలినేనితో పాటు చంద్రబాబు, బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్లకూ పవన్ చాలెంజ్ ఇచ్చారు.
చేనేత దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఉదయం చేసిన ట్వీట్లో పవన్… చంద్రబాబు, బాలినేని, లక్ష్మణ్‌లను ట్యాగ్ చేస్తూ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్రాలు ధరించి ఫోటొలు దిగాలని కోరారు.
అయితే… పవన్ ట్వీట్ నేపథ్యంలో బాలినేని వెంటనే స్పందించారు. చేనేత దుస్తులను ధరించిన ఫొటోను ట్విట్టర్ లో పంచుకున్నారు. పవన్ కల్యాణ్ విసిరిన చేనేత ఛాలెంజ్ ను స్వీకరించానని వెల్లడించారు. వైఎస్సార్ ప్రభుత్వంలో చేనేత మంత్రిగా చిత్తశుద్ధితో పనిచేశానని తెలిపారు. నాడు వైఎస్సార్ రూ.300 కోట్ల మేర చేనేతలకు రుణమాఫీ చేశారని వివరించారు.
వైఎస్ జగన్ ప్రభుత్వంలోనూ చేనేత కార్మికుల సంక్షేమం కోసం నేతన్న నేస్తం తదితర పథకాలు అమలు చేస్తున్నామని బాలినేని పేర్కొన్నారు. అప్పుడైనా, ఇప్పుడైనా చేనేతల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం నిజాయతీతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. అందరూ చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు.
దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. “గౌరవనీయ బాలినేని వాసు గారూ… నాడు చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం మీరు చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాలు అభినందనలకు నోచుకున్నాయి. ఇప్పుడు మీరు నా చాలెంజ్ ను స్వీకరించి చేనేత కార్మికుల పట్ల మరోసారి మీ అంకితభావాన్ని ప్రదర్శించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సర్” అంటూ పవన్ ట్వీట్ చేశారు.
అసలు విషయం చెప్పలేదు కదా.. టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ఈ చాలెంజ్ పవన్ కల్యాణ్‌కు ఇవ్వగా ఆయన టీడీపీ, వైసీపీ, బీజేపీలకు చెందిన ఈ ముగ్గురు నేతలకు చేనేత చాలెంజ్ ఇచ్చారు.
కాగా…. మంత్రి పదవి పోయిన తరువాత తీవ్ర అసంతృప్తితో ఉన్న బాలినేనిని పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా కదిలించడం.. ఆయన వెంటనే స్పందించడంతో సోషల్ మీడియాలో వదంతులు మొదలయ్యాయి. బాలినేని జనసేనలో చేరుతారా అనే చర్చ ఒకటి మొదలైపోయింది.