‘ప్రజల్లో మాకు తిరుగులేని ఆదరణ ఉంది. ప్రతిపక్షాలు, ప్యాకేజీ స్టార్, పచ్చ మీడియాలు కలిసి బురద జల్లుతున్నాయి. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయి’ అన్న రీతిలో తరచూ మాట్లాడే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇటీవల కాలంలో ఎదురుదెబ్బలు ఎక్కువ అవుతున్నాయి. నిజంగానే ప్రజాదరణ భారీగా ఉండి ఉంటే.. పార్టీకి చెందిన నేతలు కిక్కురుమనకుండా ఉంటారన్న చిన్న లాజిక్ ను ఆయన మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. గడిచిన కొద్ది రోజులుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎపిసోడ్ వైసీపీ వర్గాలకు నిద్ర లేకుండా చేయటం తెలిసిందే.
వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడిగా వ్యవహరించే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేయటం ఖాయమన్నట్లుగా ప్రచారం సాగుతోంది. మొన్నటివరకు పార్టీ అధినాయకత్వం మీద అసంతృప్తిని వ్యక్తం చేసిన కోటంరెడ్డి.. కొద్దిరోజులుగా తన ఫోన్ ట్యాప్ అవుతున్న వైనాన్ని వెల్లడించటం తెలిసిందే. ఇదే సమయంలో ఆయనకు సంబంధించిందని చెబుతున్న ఫోన్ కాల్ ఆడియో బయటకు వచ్చి వైరల్ గా మారింది. ఈ పంచాయితీతో అధికార పార్టీ వ్యవహారాలు హాట్ టాపిక్ గా మారాయి.
దీంతో.. ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కమ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో భేటీ అయ్యారు. వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత.. కోటంరెడ్డితోనూ ఏకాంతంగా భేటీ అయ్యారు. గంటల తరబడి సాగిన చర్చల అనంతరం బాలినేని రియాక్టుఅయ్యారు. కోటంరెడ్డి బ్రదర్స్ చంద్రబాబుతో మాట్లాడారని తేల్చి చెప్పారు. అంతేకాదు.. పార్టీని విడిచి పెట్టి వెళ్లాలనుకున్న వారు వెళ్లిపోవాలే కానీ.. ఇలా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయటం సరికాదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
కోటంరెడ్డి ఇంట్లో చిచ్చు పెట్టామని చెప్పటం సరికాదని.. ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయి.. త్వరలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇన్ ఛార్జిని పెట్టేస్తామని చెప్పటం ద్వారా.. కోటంరెడ్డి ఎపిసోడ్ రాజీ దశను దాటేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డితో మాట్లాడిన కోటంరెడ్డి అనంతరం మీడియా ముందుకు రాకుండా ఆఫీసు నుంచి వెళ్లిపోవటం చూస్తుంటే.. చర్చలు సానుకూలంగా సాగలేదనే విషయం స్పష్టమవుతోంది. బాలినేని వ్యాఖ్యల్ని చూస్తే.. కోటంరెడ్డిని వదిలించుకునేందుకు వైసీపీ సిద్ధమైందన్న విషయం ఖరారైనట్లుగా చెప్పకతప్పదు. రానున్న రోజుల్లో వైసీపీకి కోటంరెడ్డి పరీక్షగా మారటం ఖాయమన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.