ప్రకాశం జిల్లా పాలిటిక్స్ నే కాదు ఏకంగా మంత్రివర్గాన్నే శాసించే శక్తి ఉన్న నాయకులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. విద్యుత్ శాఖ మంత్రిగా నిన్నమొన్నటి వరకూ జగన్ మోహన్ రెడ్డి హయాంలో పనిచేసిన ఆయన ఒక్కసారి పదవీచ్యితులయ్యారు. ఓ విధంగా నెల రోజుల ముందే జగన్ ఈ విషయాన్ని ఆయనకు చెప్పారు కూడా! మామా నిన్ను తప్పిస్తున్నా అని! (జగన్ కు ఆయన అమ్మ తరఫు బంధువు..ఆ మాటకు వస్తే టీటీడీ ఫేం వైవీ కూడా అమ్మతరఫు బంధువే) అయితే ఆ మాటను ఆయన ఆ రోజు సీరియస్ గా తీసుకోలేదు.
అందరినీ తప్పిస్తే నన్నూ తప్పించండి దానికి పెద్దగా ఆలోచించాల్సిన పనేం ఉంది అని కూడా బదులిచ్చారని అప్పట్లో వార్తలు వెలుగుచూశాయి. కానీ ఇప్పుడు ఆయన తాను పదవిని కోల్పోవడాన్ని అస్సలు తట్టుకోలేకపోతున్నారు. ఓ వైపు అసంతృప్తితో రగిలిపోతూనే మరోవైపు అలాంటిదేమీ లేదని చెప్పడం ఓ విధంగా ఆయనకే చెల్లు.
వాస్తవానికి ప్రకాశం జిల్లాలో బాలినేని అనుచరుల హవా ఎప్పటినుంచో తీవ్రంగానే ఉందన్న వార్తలున్నాయి. సుబ్బారావు అనే వ్యక్తిని ఆయన అనుచరులు దారుణంగా దాడి చేసిన ఘటనలూ ఉన్నాయి. కానీ ఆ రోజు బాలినేని ఆయనను పిలిచి రాజీ చేయించారు. ఆ తరువాత కూడా చాలా పరిణామాలు జరిగాయి. కానీ అవేవీ పెద్దగా ఆయన రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేసేవి కాకపోయినా వైశ్య సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవడం ఇష్టం లేక ఆ రోజు దివంగత సీఎం రోశయ్య విగ్రహాన్ని ఒంగోలులో ఏర్పాటుచేస్తానని చెప్పి సంబంధిత వ్యక్తులను సంతృప్తం చేసే పనిలో పడ్డారు.
వీటన్నింటి కన్నా ముందు మాట్లాడుకోవాల్సిందే బాలినేని హయాంలో జరిగిన విద్యుత్ సంస్కరణల గురించి.. ఇవన్నీ ఆయన ప్రమేయంతో సాగాయా లేదా అన్నది అటుంచితే వ్యవసాయ మోటార్లుకు మీటర్ల బిగించే విషయమై పెద్ద చర్చే జరిగింది. కానీ అప్పుడు ఆయన మాట్లాడలేదు.అదంతా ముఖ్యమంత్రికి, కేంద్రానికి సంబంధించిన విషయంలానే చూశారు. ట్రూ అప్ ఛార్జీల సమయంలోనూ ఆయన సమర్థనీయ ధోరణిలోనే మాట్లాడారు. నిన్న మొన్నటి వేళ మళ్లీ ఛార్జీలు పెంచినప్పుడు కూడా పెంపు నామమాత్రమే అని సమర్థించుకున్నారు.
కానీ బాలినేని హయాంలో విద్యుత్ ప్రాజెక్టుల నిర్వహణ సామర్థ్యం మాత్రం అస్సలు మెరుగుపడలేదు అన్నది వాస్తవం.ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఊహాతీతంగా ఆయనకు పదవీ గండం ఎదురైంది. అయితే తాను బాధపడిన మాట వాస్తవమేనని, అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న మాట అవాస్తవం అని, అవన్నీ అసత్య ప్రచారంలో భాగమేనని, ప్రజల కోసం జగన్ నేతృత్వాన పనిచేస్తానని స్పష్టం చేశారు.
మరి! బుజ్జగింపుల మాటేంటి అని ప్రశ్నిస్తే సజ్జల గారు తన ఇంటికి భోజనం చేయడానికి వచ్చారని చెప్పడం ఈ మొత్తం ఎపిసోడ్ కే హైలెట్ పాయింట్. మరోవైపు బాలినేని షర్మిలను కలిసి విషయం వివరించి వేరు కుంపటి పెడతారన్న వార్తలూ వచ్చాయి. ఏదేమయినప్పటికీ తన కోసం వివిధ ప్రభుత్వ పదవులకు రాజీనామాలు చేసిన వారంతా వాటిని వెనక్కు తీసుకుంటారని స్పష్టం చేశారు.