సాధారణంగా.. పురుషుల్లో 30 ఏళ్లు నిండిన తర్వాత.. అనూహ్యమైన కారణాలతో జుట్టు రాలిపోయి.. బట్టతల వచ్చేస్తోంది. ఒకప్పుడు బట్టతల అంటే.. 60లు 70 ఏళ్ల వయసు పైబడిన వారికి వచ్చేదనే మాట ఉండేది. కానీ, ఇప్పుడు మారిన ఆహారపు అలవాట్లు.. వాతవరణ మార్పులు, కాలుష్యం.. ఒత్తిడి, దైనందిన జీవన అలావాట్లలో మార్పులు వంటి కారణంగా.. చిన్న వయసులోనే.. బట్టతల వచ్చేస్తోంది.
అయితే.. సాధారణంగా ఇలా బట్టతల వచ్చిన పురుషులను.. లేదా యువకులను “ఆడు బట్టతలోడురా!“ అనో.. “ఆ బట్టతలోడి చెప్పు!!“ అనే అనడం పరిపాటి. అయితే.. ఇప్పుడు ఇలా అనడం కుదరదు. ఇలా బట్టతల.. బట్టతల.. అంటూ.. పిలవడాన్ని లేదా.. అవమానించడాన్ని సీరియస్‌గా తీసుకునే చట్టాలు రెడీ అయ్యాయి. తాజాగా ఇలా బట్టతల అని అవమానించిన కేసును విచారించిన బ్రిటన్‌లోని ఇంగ్లండ్ ట్రైబ్యునల్.. దీనిని లైంగిక వేధింపుల కేసు(అంటే.. రేప్)గా నమోదు చేయాలని ఆదేశించింది.
పురుషులను బట్టతల అని పిలవడం లైంగిక వేధింపుల కిందకే వస్తుందని తీర్పు చెప్పింది ఇంగ్లాండ్ ట్రైబ్యునల్. ఈ చర్య పనిచేసే చోట వారి గౌరవాన్ని దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది. బాధితుడిని వేధింపులకు గురిచేసి, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించినందుకు.. సదరు కంపెనీ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
పనిచేసే చోట ఏ పురుషుడినైనా ‘బట్టతల’ పేరుతో సంబోధిస్తే.. అది కచ్చితంగా లైంగిక వేధింపుల కిందకే వస్తుందని ఇంగ్లండ్‌కు చెందిన న్యాయ ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. వెస్ట్ యోర్క్‌షైర్ కేంద్రంగా పనిచేసే బ్రిటిష్ బంగ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్‌పై.. ఆ సంస్థ మాజీ ఉద్యోగి టోనీ ఫిన్ దావా వేశాడు. 24 ఏళ్లపాటు తాను ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ వచ్చానని, సంస్థకు చెందిన సూపర్వైజర్ తనను బట్టతల అంటూ వేధింపులకు గురిచేశాడని పేర్కొన్నాడు.
తనను వివక్షకు గురిచేసి, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని కూడా పిటిషన్లో వివరించాడు. దీంతో తలపై జుట్టు తక్కువగా ఉందన్న కారణంగా కార్యాలయాల్లో పనిచేసే పురుషులను ‘బట్టతల’ పేరుతో పిలవడం.. అవమానించడమా? లైంగికంగా వేధించడమా? అన్న అంశంపై షెఫీల్డ్‌కు చెందిన ఎంప్లాయ్మెంట్ ట్రైబ్యునల్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో వాదోపవాదాలు జరిగాయి.
న్యాయమూర్తి జోనాథాన్ బ్రెయిన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ట్రైబ్యునల్ విచారణ చేపట్టింది. కంపెనీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బట్టతల స్త్రీ, పురుషుల్లో ఎవరికైనా ఉండవచ్చని పేర్కొన్నారు. ట్రైబ్యునల్ ఈ వాదనతో ఏకీభవిస్తూనే.. మహిళలతో పోలిస్తే, పురుషులనే ఎక్కువగా ఈ సమస్య వేధిస్తున్నందున, దీన్ని లైంగిక వేధింపులుగా పరిగణించాల్సి ఉందని వ్యాఖ్యానించింది.
‘బట్టతల’ అని పిలవడం వల్ల వ్యక్తుల గౌరవం దెబ్బతింటుందని, ఇది వారిని భయాందోళనకు గురిచేసే చర్యేనని అభిప్రాయపడింది. బాధితుడిని వేధింపులకు గురిచేసి, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించినందుకు.. సదరు కంపెనీ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ మొత్తాన్ని త్వరలోనే నిర్ణయిస్తామంటూ విచారణను వాయిదా వేసింది. అదేసమయంలో ఇకపై బట్టతల అని పిలిచి ఎవరైనా వేధింపులకు గురిచేస్తే.. రేప్ కేసు నమోదు చేయాలని ఆదేశించడం సంచలనంగా మారింది.