రాబోయే ఎన్నికల్లో టిడిపితో జనసేన పొత్తు ఉంటుందని, ఆ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయిన బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే టీడీపీ, జనసేనల పొత్తుపై బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన సంయుక్తంగా పోటీ చేసి వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతాయని బాలయ్య బాబు జోస్యం చెప్పారు. వైసీపీని ఎలా గద్దె దించాలి అన్న విషయంపైనే పవన్ కళ్యాణ్, చంద్రబాబులు చర్చించుకున్నారని బాలయ్య చెప్పారు. వైసీపీపై యుద్ధానికి పవన్ తోడుంటానని చెప్పారని, అది సంతోషకరమైన విషయం అని అన్నారు.
అనుక్షణం రాష్ట్రం కోసమే చంద్రబాబు తపన పడుతున్నారని, రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలి అన్న ధ్యాసలోనే ఉన్నారని బాలకృష్ణ అన్నారు. జైలు లోపల ఉన్నా చంద్రబాబు చాలా ధైర్యంగా ఉన్నారని బాలకృష్ణ వెల్లడించారు. ఈ క్రమంలోనే జగన్ పై బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎం కావడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అని షాకింగ్ కామెంట్లు చేశారు. తప్పు చేసిన వారంతా బయట ఉన్నారని, రాష్ట్ర ప్రజల కోసం అహర్శిశలు పాటుబడిన చంద్రబాబు జైల్లో ఉన్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి భయంతోనే జగన్ ఇలా తప్పుడు కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు.
వ్యవస్థలను జగన్ నిర్వీర్యం చేశారని బాలయ్య ఆరోపించారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. దెబ్బకు దెబ్బ వేటుకు వేటు…తప్పు చేయనివాడు దేవుడికి కూడా భయపడడు అని, తప్పు చేసిన వారు భయపడాలనిని బాలయ్య ఎమోషనల్ అయ్యారు. ఫైబర్ గ్రిడ్ ఎప్పుడో వచ్చిందని, దాంట్లో తవ్వేదేమీ లేదని…ఇసుక, గనులు తవ్వుకుంటూ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా జగన్ చేస్తున్నారని ఆరోపించారు.