రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక గాలి వీస్తోందని టీడీపీ సహా ప్రతిపక్ష నేతలంతా చెబుతున్నా…అధికార పార్టీ నేతలు మాత్రం ఫ్యాన్ గాలి స్పీడ్ తగ్గలేదని బుకాయిస్తూ వస్తున్నారు. ఇటువంటి వైసీపీ నేతలకు తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాక్ తగిలింది. ఏపీలో 3 పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆల్రెడీ రెండింటిని కైవసం చేసుకున్న టీడీపీ మూడో స్థానంలోనూ ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు కైవసం చేసుకోగా, తూర్పు రాయలసీమ శాసనమండలి గ్రాడ్యుయేట్ స్థానంలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ స్థానంలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మొత్తం 11 రౌండ్లకుగాను వైసీపీ బలపరిచిన వెన్నపూస రవీంద్రారెడ్డికి 95,969, టీడీపీ బలపరిచిన భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి 94,149 ఓట్లు పోలయ్యాయి.
మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ గెలుపుకు సరిపడిన ఓట్లు రానందువలన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ద్వారా విజేతను నిర్ణయించారు. వైసీపీ బలపరిచిన అభ్యర్థి రవీంద్రా రెడ్డిపై టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి 7500 పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. దీంతో, టీడీపీ హ్యాట్రిక్ కొట్టింది. ఓ దశలో ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, రీకౌంటింగ్ చేపట్టాలని వైసీపీ బలపరిచిన అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి కింద కూర్చుని నిరసన తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వెలుపల వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం నినాదాలు చేశారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో హ్యాట్రిక్ విజయాలపై టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. ‘‘వై నాట్ 175’’ అని జగన్ ఇప్పుడంటే వినాలని ఉందని బాలయ్య సెటైర్లు వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని తొక్కిపట్టి నార తీశారని తనదైన శైలిలో బాలయ్య చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. పులివెందుల కోటకు బీటలు పడుతున్నాయని, త్వరలో ఆ బీటలు తాడేపల్లి ప్యాలెస్ వరకు చేరతాయని బాలయ్య జోస్యం చెప్పారు. గెలిచిన టీడీపీ అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు.