నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి చిత్రం సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన సక్సెస్ మీట్ లో మాట్లాడిన బాలయ్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దేవ బ్రాహ్మణులను ఉద్దేశించి బాలకృష్ణ చేసిన కామెంట్ల పై దుమారం రేగింది. దేవ బ్రాహ్మణుల గురువు దేవల మహర్షి అని, వారి నాయకుడు రావణబ్రహ్మ అని బాలకృష్ణ వ్యాఖ్యానించడంతో ఆ వర్గం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాలకృష్ణ చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై బాలకృష్ణ స్పందించారు. ఎవరినీ బాధ పెట్టాలన్న ఆలోచన తనకు లేదని, ఇతరుల మనసు నొప్పించేతత్వం తనది కాదని బాలకృష్ణ చెప్పారు. దురదృష్టవశాత్తు ఆ వ్యాఖ్యలు అలా నోటినుంచి పొరపాటున వచ్చాయని వివరణ ఇచ్చారు. తనకు అందిన సమాచారం తప్పని తెలియజేసిన దేవ బ్రాహ్మణ పెద్దలకు పేరుపేరునా కృతజ్ఞతలు చెబుతున్నానని బాలకృష్ణ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
మరోవైపు, వీరసింహారెడ్డిలో బాలకృష్ణ చెల్లెలుగా నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ పై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ ను తనతో కలిసి హీరోయిన్ గా నటించాలని బాలయ్య కోరారు. ఈ చిత్రంలో వరలక్ష్మి చాలా గొప్పగా నటించిందని, నాయకురాలు నాగమ్మ తరహా పాత్రలు చేయగలిగే నటి తెలుగు ఇండస్ట్రీకి దొరికిందని బాలయ్య కితాబిచ్చారు. అయితే, ఈ చిత్రంలో బాలయ్య చెల్లెలుగా పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు గోపీచంద్ పై తాను కోపంగా ఉన్నానని, భవిష్యత్తులో మీతో నటించే అవకాశం వస్తే తప్పక హీరోయిన్ గా చేస్తానని వరలక్ష్మి చెప్పింది. బాలయ్యకు కోపం ఎక్కువని చెప్పారని, డిసిప్లన్ విషయంలో మాత్రమే కోప్పడతారని, మిగతా విషయాల్లో ఆయన చాలా సరదాగా ఉంటారని వరలక్ష్మి ప్రశంసించింది.