మాస్ కా బాప్, నందమూరి నటసింహం బాలకృష్ణకు మాస్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆరు పదుల వయసు దాటినా సరే కుర్ర హీరోలతో పోటీపడుతూ బాలయ్య బాబు బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తున్నారు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ అన్ స్టాపబుల్ అంటూ రియాల్టీ షో హోస్ట్ గాను బాలయ్య దూసుకుపోతున్నారు. తెలుగు రియాల్టీ షోలలో ఒక కొత్త ఒరవడికి తెరతీస్తూ అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె షో రెండు సీజన్లను బాలయ్య రక్తి కట్టించారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా బాలకృష్ణ మరో కొత్త అవతారం ఎత్తబోతున్నారు. ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బాలకృష్ణ తెలుగులో కామెంట్రీ చేయబోతున్నారు. ఈ నెల 31న ప్రారంభం కానున్న ఐపీఎల్-2023 తొలి మ్యాచ్ లో బాలకృష్ణ తెలుగులో కామెంట్రీ చేయబోతున్నారు. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ల మధ్య అహ్మదాబాద్ లో జరగబోతున్న తొలి మ్యాచ్ కు బాలకృష్ణ కామెంట్రేటర్ గా వ్యవహరించబోతున్నారు.
స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంట్రీ బాక్స్ లో టీమిండియా మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్, వేణుగోపాల్ రావులతో కలిసి బాలయ్య అచ్చ తెలుగు కామెంట్రీతో అదరగొట్టబోతున్నారు. ఈ ప్రకారం స్టార్ స్పోర్ట్స్ తెలుగుతో బాలకృష్ణ ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతేకాదు, ఐపీఎల్ 2023 ప్రమోషన్స్ కోసం కూడా బాలకృష్ణ తమతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు స్టార్ స్పోర్ట్స్ తెలుగు ప్రకటించింది. బాలకృష్ణ సినిమా షూటింగ్ జరుగుతున్న చోటుకే వెళ్లి ఆయనతో ఓ ప్రమోషన్ వీడియోను స్టార్ స్పోర్ట్స్ తెలుగు టీం షూట్ చేసింది.
ఇక, బాలకృష్ణను కామెంట్రీకి ఆహ్వానిస్తూ ప్రసాద్, వేణుగోపాల్ రావులు ఆయనకు ఒక బ్యాట్ ను అందించిన ఫోటో వైరల్ గా మారింది. ఐపీఎల్-20 23 సీజన్ కోసం స్టార్ స్పోర్ట్స్ తెలుగుతో ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని బాలయ్య అన్నారు. తెలుగు ప్రేక్షకులు తనను నటనలోనే కాకుండా ఆటలో కూడా చూడబోతున్నారని చెప్పారు. క్రికెట్ అంటే తనకు బాల్యం నుంచి మక్కువ ఎక్కువ అని బాలయ్య బాబు అన్నారు. అటువంటి తాను క్రికెట్ మ్యాచ్ కు కామెంట్రేటర్ గా రావడం ఒక గొప్ప అనుభూతి అని, క్రికెట్ ఆడుతున్నంత అనుభూతిని కామెంట్రేటర్ గా పొందుతానని ఆశిస్తున్నట్లు చెప్పారు.