తన సోదరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో వైసీపీ నాయకులపై నందమూరి రామకృష్ణ ఫైర్ అయ్యారు. బాలకృష్ణ నివాసంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన భావోద్వేగంతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆ విషయాలు బాలకృష్ణ మాటల్లోనే..
దేవాలయం లాంటి నందమూరి కుటుంబం మీదకి వస్తే సహించం. మా ఇంటి ఆడపడుచుకు జరిగినట్లు ఎవరికీ జరగకూడదు. పేర్లు తీసుకురావడం తప్పడం లేదు. ఒరేయ్.. నానిగా, వంశీగా.. అంబటి రాంబాబు.. ఒరేయ్ చంద్రశేఖర్రెడ్డి జాగ్రత్త! ఇది హెచ్చరిక కాదు. మీరు హద్దు మీరిపోయారు. ఇక మీదట మీరు జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ ఎలా ఉంటుందో మీకు తెలియడం లేదు. మీ ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు. మీ గురించి ఏం అనుకుంటున్నారో వెనక్కి తిరిగి చూసుకోండి. వాళ్ల భవిష్యత్ గురించి ఆలోచించండి.
ఇంకోసారి దేవాలయం లాంటి నందమూరి కుటుంబ సభ్యులపైకి ఎవడైనా వస్తే బాగుండదు. రాజకీయంగా ఏమన్నా ఉంటే చూసుకోండి. కానీ వ్యక్తిగతంగా ఇటువంటి వ్యాఖ్యలు మేం ఎప్పుడూ వినలేదు. మేం గాజులు తొడుక్కొని కూర్చోలేదు. మా నాన్నగారు స్థాపించిన టీడీపీకి ఓ క్రమశిక్షణ అంటూ ఉంది. దాన్ని మేం పాటిస్తున్నాం. దేనికైనా సహనం ఉంటుంది. మా సహనాన్ని పరీక్షిస్తున్నారు. మేం హద్దు దాటితే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు మరో కుటుంబంలో జరగకూడదని కోరుతున్నా.. జాగ్రత్త.
నందమూరి సుహాసిని మాట్లాడుతూ.. “చాలా బాధకరమైన రోజు. మా అత్త భువనేశ్వరి మీద ఇలాంటి ఆరోపణలు చేస్తారా? ఏ రోజూ ఆమె రాజకీయాల్లోకి రాలేదు. మా కుటుంబానికి అండగా ఉన్నారు. తన వ్యాపారం చూసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఇది దురదృష్టకరం. తెలుగు ప్రజలు అన్నా అని పిలుచుకునే ఎన్టీఆర్ కూతురి గురించి ఇలా మాట్లాడటం చాలా బాధగా ఉంది. రాజకీయం రాజకీయ నాయకుల మధ్యే ఉండాలి. కానీ కుటుంబ సభ్యుల గురించి, ఆడవాళ్ల గురించి మాట్లాడకూడదు. రాజకీయాల్లోకి వాళ్లను లాగొద్దు. ప్రజలందరూ దీన్ని తీవ్రంగా ఖండించాలి” అని పేర్కొన్నారు.