ఇటీవల కాలంలో నటసింహం నందమూరి బాలకృష్ణ సక్సెస్ కు కేరాఫ్ గా మారిపోయారు. వరుస విజయవంతమైన చిత్రాలతో యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇప్పటికే అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న బాలయ్య.. రీసెంట్ గా `డాకు మహారాజ్`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. బాబీ కొల్లి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జనవరి 12న విడుదలైన సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
తాజాగా డాకు మహారాజ్ సక్సెస్ మీట్ ను అనంతపురంలో చాలా గ్రాండ్ గా నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ కు హాజరైన తన అభిమానులను, ప్రేక్షకులను ఆనందపరిచేందుకు వేదికపై బాలయ్య పాట పాడారు. తాను నటించిన డిక్టేటర్ మూవీలోని `గణగణ గణ గణ ఆంధ్ర తెలంగాణ` పాటను ఎంతో హుషారుగా పాడి ఫ్యాన్స్ తో ఈలలు వేయించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
కాగా, బాలయ్య ఇలా సింగర్ గా మారడం తొలిసారేమి కాదు. గతంలో కూడా పలు సందర్భాల్లో వేదికపై పాట పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2017లో విడుదలైన పైసా వసూల్ చిత్రంలో `మామా ఎక్ పెగ్ లా` అంటూ పాట పాడి అభిమానులను ఉర్రూతలూగించారు. ఇప్పుడు మరోసారి ఆయన సింగర్ గా మారడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య `అఖండ 2` మూవీలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఇటీవలె పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.