రెండోసారి అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ కారణంగా భారత ఐటీ రంగం మీద ఉండే ప్రభావం ఎంత? అన్నదిప్పుడు చర్చగా మారింది. హెచ్ 1బీ వీసాల జారీపై ట్రంప్ వినిపిస్తున్న వాదనలు మన మీద ఎంత ప్రభావాన్ని చూపుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
అయితే.. ఈ అంశంపై ఎలాంటి టెన్షన్ అక్కర్లేదని అభయమిస్తోంది ఐటీ పరిశ్రమల సంఘం నాస్కామ్. ఎందుకంటే.. అమెరికా ఆర్థిక వ్రద్ధికి సాంకేతికత కీలకమన్న విషయాన్ని గుర్తు చేస్తున్న నాస్కామ్.. హెచ్1బీ వీసాలపై వెళ్లే సిబ్బంది చాలా తక్కువ జీతాలకు పని చేస్తారని.. అమెరికా నిపుణులకు చెందాల్సిన ఉద్యోగాలను భర్తీ చేస్తారని.. అమెరికాలో వేతనాలు తగ్గేందుకు కారణమవుతన్నారని అనుకోవటం కేవలం భ్రమగా చెబుతున్నారు.
అయితే.. హెచ్ 1బీ వీసాలతోఅమెరికాకే మేలు ఎలా జరుగుతుందన్న దానికి సింఫుల్ సమాధానం ఏమంటే.. కీలక నైపుణ్యాల అంతరాన్ని పూడ్చటానికి హెచ్ 1బీ వీసాల మీద వెళ్లే వారు సహకరిస్తారన్న విషయాన్ని మర్చిపోకూడదని గుర్తు చేస్తున్నారు. భారత ఐటీ పరిశ్రమ వృద్ధిపై ఎలాంటి సందేహాలు అక్కర్లేదని.. అమెరికా ఆర్థిక వృద్ధికి భారత్.. భారత నిపుణుల పాత్ర అత్యంత కీలకమని చెబుతున్నారు నాస్కామ్ ఉపాధ్యక్షుడు శివేంద్ర సింగ్.
అమెరికాలో చోటు చేసుకున్న తాజా పరిణామాలతో భారత ఐటీ పరిశ్రమపై ఎలాంటి నీలి నీడలు కమ్ముకోవన్న ధీమాను ఆయన వ్యక్తం చేసతున్నారు. అదే సమయంలో హెచ్ 1బీ వీసా ఉన్న వారు తమ పిల్లల పౌరసత్వ విషయంలో ఎదుర్కొనే సవాళ్ల విషయంలో మాత్రం తాను సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లుగా పేర్కొన్న మాటల్ని అండర్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి. హెచ్ 1 బీ వీసాల్లో 70 శాతం భారతీయులకే లభించటం మన వాళ్ల నైపుణ్యాలకున్న గిరాకీని తెలియజేస్తుందని చెప్పాలి.