సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఉన్నది ఉన్నట్టుగా, ముక్కుసూటిగా మాట్లాడడం బాలయ్య నైజం. బాలకృష్ణను దగ్గరగా చూసినవారు ఆయన భోళా మనిషి అంటుంటారు. అటువంటి బాలకృష్ణ కొన్ని సందర్భాల్లో పొరపాటున నోరు జారినా కూడా తీవ్ర వివాదాస్పదమవుతున్న వైనం ఇపుడు చర్చనీయాంశమైంది.
అక్కినేని తొక్కినేని అంటూ ఫ్లోలో బాలయ్య అన్న మాటలతో కొందరు వివాదం రేపారు. తాను ఫ్లోలో అలా అన్నానని, అక్కినేని అంటే తనకు బాబాయి వంటి వారని బాలయ్య వివరణనివ్వడంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. ఈ క్రమంలోనే తాజాగా అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతున్న బాలయ్య బాబు…నర్సుల గురించి చేసిన కామెంట్ కాక రేపుతోంది. దానమ్మ ఆ నర్స్ చాలా అందంగా ఉంది అంటూ బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
దీంతో, నర్సులకు బాలయ్య క్షమాపణలు చెప్పాలని నర్సుల సంఘం నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై బాలయ్య స్పందించారు. కొందరు కావాలనే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, దాన్ని తాను ఖండిస్తున్నానని అన్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో నర్సుల సేవలను తాను ప్రత్యక్షంగా చూశానని, రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేస్తుంటారని కితాబిచ్చారు.
రోగుల ప్రాణాలు నిలిపే వారంటే తనకెంతో గౌరవం అని అన్నారు. కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా నర్సలు ప్రాణాలను పణంగాపెట్టి, నిద్రాహారాలు మాని రోగులకు సేవలు అందించారని కొనియాడారు. అటువంటి నర్సులను మెచ్చుకుని తీరాలని అన్నారు. ఒకవేళ తన మాటలు వారి మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని బాలకృష్ణ అన్నారు.