తన తండ్రి నందమూరి తారకరామారావు 101వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘన నివాళులర్పించారు. ఉమ్మడి ఏపీలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని, తెలుగువారి ఆరాధ్య దైవం అయిన అన్నగారిని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది ఉన్నత శిఖరాలను అధిరోహించారని గుర్తు చేసుకున్నారు.
రైతు కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ చదువుకే ప్రాధాన్యతనిచ్చారని, అనంతరం సినీరంగంలోకి వచ్చారని తెలిపారు. నవరసాలకు అలంకారం, నటనకు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ అని పొగడ్తలతో ముంచెత్తారు. సినీ రంగంలో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న సమయంలోనే ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. వైద్యులు, న్యాయవాదులు, అభిమానులను చైతన్యపరిచి రాజకీయాల్లోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన అన్నగారు తీసుకొచ్చిన పథకాలనే అందరూ అవలంబిస్తున్నారని చెప్పారు.
తమ తాతయ్య ఎన్టీఆర్ 101వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళులు అర్పించారు.