తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావును బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అందిస్తున్న సేవలను, సంస్థ కార్యకలాపాలను, ఆశయాలను హరీష్ రావుకు బాలయ్య వివరించారు. హాస్పిటల్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లారు.
హాస్పిటల్ డెవలప్ మెంట్ కు ప్రభుత్వం తరపు నుంచి తగిన మద్దతు ఇవ్వాలని హరీష్ రావును బాలయ్య కోరారు. బాలయ్య వినతిపై హరీష్ రావు సానుకూలగా స్పందించారు. హరీష్ రావును కలిసే సందర్భంలో బాలకృష్ణతో పాటు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సీఈఓ డాక్టర్ ఆర్వి ప్రభాకర్ రావు కూడా ఉన్నారు. అయితే, గతంలోనే బసవతారకం హాస్పిటల్ కు సంబంధించిన కొన్ని సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి బాలయ్య తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆ సమస్యలను కేసీఆర్ ప్రభుత్వం సత్వరమే పరిష్కరించింది. దీంతో, తాజాగా విన్నవించిన సమస్యలకు హరీష్ రావు కూడా సత్వర పరిష్కారం చూపుతారని బాలయ్య ఆశిస్తున్నారు.
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు సతీమణి బసవతారకం కేన్సర్ బారినపడి తీవ్ర ఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలలోని భావితరాలవారు ఆ ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ ఈ ఆసుపత్రికి అంకురార్పణ చేశారు. 2000లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి చేతుల మీదుగ ఆ హాస్పిటల్ ను ప్రారంభించారు. రేషన్‌కార్డు ఉన్నవారికి తక్కువ ఖర్చుతోనే వైద్యం అందిస్తున్నారు. పేదవారికి ఉచిత వైద్యంతో పాటు కార్పస్ ఫండ్ ఏర్పాటుచేసి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు. ఇక, 2018లో బసవతారకం కేన్సర్ ఆస్పత్రి విజయవాడలోని సూర్యారావు పేటలో ప్రారంభమైంది. వారంలో 2 రోజుల పాటూ డాక్టర్లు ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు.