ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జూలై 7 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలు ఘనంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందేే. ఈ సభలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు కూడా హాజరుకాబోతున్నారు. ఈ క్రమంలోనే ఆ సభలకు హాజరయ్యేందుకు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బయలుదేరారు.
ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ సతీసమేతంగా అమెరికాకు బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ విమానాశ్రయంలో బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర అమెరికాకు వెళ్లేందుకు వచ్చారు. ఈ సందర్భంగా వారిద్దరూ కెమెరాలకు చిక్కారు. బాలయ్య బాబు రాక కోసం ఎన్నారై టీడీపీ నేతలు, ఎన్నారైలు ఎదురుచూస్తున్నారు.
అంతకుముందు, తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లిలు హైదరాబాద్ కు వచ్చి బాలకృష్ణను స్వయంగా కలిసి తానా మహాసభల ఆహ్వాన పత్రాన్ని అందించిన సంగతి తెలిసిందే. తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను, తెలుసుకుని తానా నాయకులను బాలకృష్ణ అభినందించారు. డిసెంబర్ 2022లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి కోటి రూపాయల విరాళాన్ని అందించిన విషయాన్ని బాలయ్య గుర్తు చేసుకున్నారు.