హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంతో బిజీబిజీగా ఉన్నారు. అనంతపురం జిల్లాలో తన నియోజకవర్గమైన హిందూపురంలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ పై బాలకృష్ణ విమర్శలు గుప్పించారు.
ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారని, రెండేళ్లలో ఏం అభివృద్ధి చేశారో సమాధానం చెప్పాలని నిప్పులు చెరిగారు. మున్సిపల్ ఎన్నికల్లో జవాబుదారీతనం ఉన్న పార్టీకి ఓటు వేయాలని, వ్యవస్థలను వైసీపీ నిర్వీర్యం చేసిందని బాలయ్య ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని, ఇసుక.. మద్యం మాఫియా రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు.
రాష్ట్రంలో యువత భవిష్యత్తు అంధకారం అయిందని, హిందూపురాన్ని టీడీపీ హయాంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. హిందూపురంలో టీడీపీ హయాంలో మట్కా..వంటి పలు అసాంఘిక కార్యకలాపాలను రూపుమాపామని, వైసీపీ హయాంలో ఇవన్నీ రాజ్యమేలుతున్నాయని బాలకృష్ణ మండిపడ్డారు. నిత్యావసర ధరలు సామాన్యులకు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలో నలుగురు మంత్రుల మాఫియా నడుస్తోందని, ఒకరు చంద్రబాబును తిట్టడానికి…మరొకరు లిక్కర్ మాఫియా అని దుయ్యబట్టారు. అన్నింటినీ ప్రైవేటు పరం చేసి వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, జగన్ హయాంలో ఐఏఎస్, ఐపీఎస్ల పరిస్థితి మారిపోయిందని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు.