ఏపీలో సినిమా టికెట్ల వివాదం ముదిరి పాకానపడిన సంగతి తెలిసిందే. సినిమా వాళ్లు బలిసినోళ్లంటూ వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. ఆ కామెంట్లపై ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ మండిపడిన సంగతి తెలిసిందే. ఇక, ఏపీలో అధికార పార్టీ నేతలు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారంపై హీరో నందమూరి బాలకృష్ణ స్పందించారు.
ఏపీలో సినిమాగోడును పట్టించుకునే వారే లేరని, వినిపించుకునే నాథుడు లేడని బాలయ్య అన్నారు. సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఇండస్ట్రీ తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానన్నారు. దీనిపై తానొక్కడిని మాట్లాడితే సరిపోదని, అందరూ కలిసి చర్చించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టాలని సూచించారు.. తనకంటూ ఏ అభిప్రాయమూ లేదని, ఒక్కరి అభిప్రాయంతో పనిజరగదని చెప్పారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఇతర వర్గాలు కలిసి ప్రతిపాదనలు చేయాలన్నారు.
హైదరాబాద్ లో ‘అఖండ సంక్రాంతి సంబరాలు’ విజయోత్సవ సభలో బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ లోనూ అఖండ చెలరేగిపోతోందని, అక్కడి నుంచి కూడా వీడియోలు వస్తున్నాయని చెప్పారు. అన్ సీజన్ లో రిలీజైన అఖండకు ఏపీ, తెలంగాణలతోపాటు ఇతర దేశాల్లోనూ ఆదరిస్తున్నారని, ఇది పాన్ వరల్డ్ చిత్రంగా మారిందన్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను భారతీయ చిత్ర పరిశ్రమ గర్వపడే డైరెక్టర్ అని అన్నారు.