అసెంబ్లీ హుందాగా నడవాలని బాలకృష్ణ అన్నారు. సభాపతి అధికార ప్రభుత్వానికి ఏకపక్షంగా వ్యవహరించడం తగదని అయన చెప్పారు. శాసనసభలో తన సోదరి భువనేశ్వరిపై వైసీపీ నాయకులు నీచమైన వ్యాఖ్యలు చేయడంపై ఆయన ఘాటుగా స్పందించారు. విలేకర్ల సమావేశంలో అధికార వైసీపీ ప్రభుత్వాన్ని ఆ పార్టీ నాయకులను హెచ్చరించారు.
ఇంకా హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ ఏమన్నారంటే..
అసెంబ్లీ హుందాగా నడవాలి. కానీ సభాపతి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఏకపక్షంగా ప్రభుత్వ పక్షంగా వ్యవహరిస్తున్నారు. మా సంస్కృతి సంప్రదాయం కాదంటూ మేం చేతులు ముడుచుకుని కూర్చోవడం ఇక ఉండదు.
మనకు ఓ గుర్తింపు, చైతన్యం, గౌరవం ఇచ్చారు ఎన్టీఆర్. ఇప్పుడు రాష్ట్రంలో పరిపాలన ఏం జరుగుతోంది? మంచి సలహాలు ఇస్తే తీసుకోరు. మీరు మనుషులు మారరు. కానీ కుటుంబ సభ్యులే కాదు.. ప్రజానీకం.. మా అభిమానులైతేనేమీ.. కార్యకర్తలు అయితేనేమీ.. మిమ్మల్ని మెడలు వంచి మారుస్తారు.
మీరు మైండ్‌గేమ్ ప్లే చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ ఏదీ శాశ్వతం కాదు. జనం మీ పరిపాలన చూస్తున్నారు. ఎలా వ్యవస్థలను నిర్వీర్యం చేసేసి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారో గమనిస్తున్నారు. మళ్లీ ఎన్నికలు వస్తాయి. అది గుర్తుంచుకోవాలి.
బాలకృష్ణ అక్క లోకేశ్వరి మాట్లాడుతూ.. అసెంబ్లీలో జరిగింది దురదృష్టకరం. నా వరకూ అసెంబ్లీ ఓ దేవాలయంతో సమానం. అక్కడ ప్రజా సమస్యలను చర్చించి ఓ పరిష్కారానికి వస్తారు. కానీ కొంతమంది నోటికి వచ్చినట్లు మాట్లాడి దాన్ని అపవిత్రం చేస్తున్నారు. బాబు లాంటి పెద్ద మనిషి విలపిస్తుంటే చూడలేకపోతున్నాం. మా చెల్లి భువనేశ్వరి అంతకంటే ఎక్కువ బాధలో ఉంది. బాబు హయాంలో ఏనాడూ విజయమ్మ, భారతి, షర్మిలను ఎవరూ ఏ మాట అనలేదు. కానీ ఇప్పుడు ఇలా మట్లాడటం చాలా తప్పు. ఇది మళ్లీ రిపీట్ అయితే బాగుండదు. ఎన్టీఆర్ రక్తమే బాలయ్యలో ఉంది. మళ్లీ ఇలాంటిది జరిగితే ఇంకో అవతారం చూడాల్సి వస్తుంది.