తెలుగు చలనచిత్ర చరిత్రలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు నటించిన ‘నర్తన శాల’ చిత్రం ఓ గీటురాయి. ఆ క్లాసిక్ మూవీలో ఇటు అర్జునుడి పాత్రలో…అటు బృహన్నల పాత్రలో నటించిన ఎన్టీఆర్…ఇటు ప్రేక్షకుల, అటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో తన తండ్రి నటించిన ఆణిముత్యం వంటి చిత్రాన్ని ఈ తరం ప్రేక్షకులకు అందించాలని నందమూరి బాలకృష్ణ అనుకున్నారు. తన స్వీయ దర్శకత్వంలో బాలయ్య బాబు మొదలుపెట్టిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఈ చిత్రంలో ద్రౌపదిగా దివంగత నటి సౌందర్య నటించారు.
కొన్ని అవాంతరాలు రావడం, సౌందర్య ఆకాల మరణం వంటి పలుకారణాలతో ఈ ప్రాజెక్టు 17 నిమిషాలు రన్ టైం షూటింగ్ జరిగాక ఆగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ 17 నిమిషాల నిడివి ఉన్న చిత్రాన్ని విడుదల చేసేందుకు బాలయ్య సిద్ధమవుతున్నారు. షూటింగ్ జరుపుకున్న ఆ కొంత భాగానికి ఎడిటింగ్, రీ రికార్డింగ్, డబ్బింగ్ పూర్తి చేసి ఆ 17 నిమిషాల ఎపిసోడ్ ను ఎన్ బీకే థియేటర్ లో `శ్రేయాస్` ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని బాలకృష్ణ తన ఫేస్ బుక్ పేజిలో పోస్ట్ చేశారు.
బాలయ్య తెరకిక్కిస్తున్న నేపథ్యంలో ఆ ‘నర్తనశాల’కు మంచి క్రేజ్ వచ్చింది. నందమూరి నటవారసుడు..తన తండ్రి నుంచి దర్శకత్వ వారసత్వాన్ని కూడా పుణికి పుచ్చుకున్నారని…ఆ చిత్రం చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. బాలకృష్ణ అర్జునుడి గానూ, సౌందర్య ద్రౌపది గానూ, శ్రీహరి భీముడి గానూ, శరత్ బాబు ధర్మరాజుగానూ ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. వీరి కాంబినేషన్లో కొన్ని సీన్స్ షూట్ చేశారు.
అయితే, అనుకోకుండా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే, ఈ ఏడాది బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఆ 17 నిమిషాల నిడివి ఉన్న ఎపిసోడ్ విడుదల చేద్దామనుకున్నారట. అయితే, కరోనా మహమ్మారి నేపథ్యంలో విడుదల వాయిదాపడింది. దీంతో, తాజాగా ఈ నెల 24న దుర్గాష్టమి సందర్భంగా ‘శ్రేయాస్’ లో `నర్తనశాల`ను విడుదల చేయబోతున్నారు. అయితే, పే పర్ వ్యూ విధానంలో టికెట్ కొని ఈ ఎపిసోడ్ వీక్షించాల్సి ఉంటుంది.
ఈ ఎపిసోడ్ ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీకి ఉపయోగించడానికి సంకల్పించానని నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. బాలయ్య ‘నర్తన శాల’ ఎలా ఉండబోతోంది? ఆయన దర్శకత్వ ప్రతిభ ఏమిటన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.