సీఎం జగన్ పై రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఛాన్స్ అన్న జగన్…రాయలసీమకు చేసిందేమీ లేదని, ఒక మాటలో చెప్పాలంటే జగన్ సీఎం అయిన తర్వాతే రాయలసీమకు అన్యాయం జరిగిందని నిప్పులు చెరిగారు. కొన్ని ప్రాజెక్టుల వల్ల ప్రతిరోజు రాయలసీమ నాశనం అవుతుందని కేంద్రానికి జగన్ ఎందుకు చెప్పలేదని ఆయన నిలదీశారు.
వైసీపీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తుంటే దిక్కు లేదని ఎద్దేవా చేశారు. చిన్న వయసులో సీఎం అయిన జగన్ పాలనలో ఘోరంగా విఫలమయ్యారని, కడప ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన తప్ప చేసింది ఏమీ లేదని విమర్శలు గుప్పించారు. కొందరు బైరెడ్డి అనే పేరుతో తోలు కప్పుకొని దందాలు చేస్తున్నారని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పచ్చని కుటుంబాల్లో జగన్ చిచ్చు పెడుతున్నారని…సిద్ధార్థ రెడ్డిని పరోక్షంగా కామెంట్ చేశారు.
కేబుల్ బ్రిడ్జి సెల్ఫీలు దిగడానికి తప్ప దేనికి పనికిరాదని, జగన్ కు లేఖలు రాసినా ఫలితం లేదని అన్నారు. ఆయన చెవిలో సీసం పోసుకున్నారని ఎద్దేవా చేశారు. అందుకే, సేవ్ రాయలసీమ పేరుతో పోరాటం చేస్తామని అన్నారు. అమ్మ ఒడి…పేరుతో జగన్ మాయ మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీని నాశనం చేశారని, ఓ వైపు బటన్ నొక్కడం మరోవైపు కత్తిరించడమే జగన్ పాలన అని చురకలంటించారు.
కాగా, సైకో పోవాలి సైకిల్ రావాలి అని టిడిపి నేతలు కొద్దిరోజుల క్రితం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర మాజీ మంత్రి, టిడిపి నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అన్నారు. కర్నూల్ లో మీడియాతో మాట్లాడిన కోట్ల… జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటేనే సీమ కష్టాలు తొలగుతాయని, సాగు తాగు నీటి కష్టాలు పోవాలంటే ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. కావాలనే టిడిపి కార్యకర్తలను పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని కోట్ల మండిపడ్డారు.