షెడ్యూల్డ్ కులాలకు చెందిన దర్శకులు, నటీనటుల వల్లే ఇండస్ట్రీలో మంచి సినిమాలు రావడం లేదని, వారిని ఇండస్ట్రీ నుంచి వెళ్లగొట్టాలని ప్రముఖ మోడల్, కోలీవుడ్ నటి మీరా మిథున్ చేసిన వ్యాఖ్యలు తమిళ చిత్ర పరిశ్రమలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. మీరా మిథున్ వ్యాఖ్యలపై దళిత సంఘాలు మండిపడ్డాయి. ఈ క్రమంలోనే మీరాపై కేసు నమోదైంది. ఆమెతో పాటు ఆమె స్నేహితుడు అభిషేక్ పై కూడా కేసు నమోదైంది. దీంతో, ఆమె బెయిల్ కోసం అప్లై చేసింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా మీరా మిథున్‌కు చెన్నై ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు షాకిచ్చింది. మీరా మిథున్ తోపాటు ఆమె స్నేహితుడు అభిషేక్ కు కూడా బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. వారు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. వాస్తవానికి వారిద్దరూ గత వారమే బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణ వాయిదా వేసింది. తాజాగా ఆ పిటిషన్ పై నేడు విచారణ జరిపి బెయిల్ నిరాకరించింది.
తన అనుమతి లేకుండా తన ఫొటోను ఓ దర్శకుడు వాడుకోవడాన్ని మీరా మాథుర్ తప్పుబట్టింది. ఈ క్రమంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారి వల్లనే మంచి సినిమాలు రావడం లేదని, వారి పద్ధతులు బాగుండవని మీరా మాథుర్ వ్యాఖ్యానించడంపై ఇండస్ట్రీ మండిపడుతోంది. అంతేకాదు, ఇండస్ట్రీలోని షెడ్యూల్డ్ కులాల వాళ్లకు అనేక నేరాలకు సంబంధం ఉందని కూడా మీరామాథుర్ చెప్పడంతో ఆమెపై కేసు నమోదైంది. అయితే, తన వ్యాఖ్యలు పెను దుమారం రేపడంతో మీరా మిథున్ కేరళకు పారిపోయి దాక్కుంది. అయితే, చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చి జైలుకు తరలించారు.