ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఇసుక కేసు, మద్యం కేసులలో హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. ఆ కేసులలో చంద్రబాబుకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతోపాటు మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ నరేశ్ లకు కూడా ముందస్తు బెయిల్ లభించింది. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
లేని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో గోల్ మాల్ అంటూ కేసు పెట్టడం సరికాదని లూథ్రా వాదించారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా ఇసుక అందించేందుకు ఇసుక పాలసీని రూపొందించారని, దానిపై కూడా వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందని వాదనలు వినిపించారు. మద్యం పాలసీ కూడా ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయమని, చంద్రబాబుకు దానిని ఆపాదించి నేరంగా పరిగణించడం సరికాదన్నారు. ఈ మూడు కేసులలో నెల రోజుల క్రితం వాదనలు పూర్తి కాగా జస్టిస్ సి మల్లికార్జున రావు నేతృత్వంలోని బెంచ్ తీర్పును రిజర్వులో ఉంచింది.