తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ గత రెండు నెలలుగా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఓ జ్యోతిష్యుడిని బ్లాక్ మెయిల్ చేశారన్న ఆరోపణతోపాటు మల్లన్నపై పలు కేసులు నమోదు చేశారు పోలీసులు. మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయంలో గతంలో సోదాలు నిర్వహించిన పోలీసులు…కొన్ని హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఓ యువతి కూడా మల్లన్నపై పలు ఆరోపణలు చేయడంతో మరో కేసు నమోదైంది.
ఇలా, మల్లన్నపై నమోదైన పలు అభియోగాలకు సంబంధించి గతంలో తెలంగాణ హైకోర్టుకూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకే తరహా అభియోగాలున్న అనేక కేసుల్లో మిగిలిన కేసులను స్టేట్ మెంట్స్ గా పరిగణించాలని పేర్కొంది. ఇక, ప్రతీకారం తీర్చుకునేలా తెలంగాణ పోలీసులు వ్యవహరించకూడదని కూడా కోర్టు చెప్పింది. ఈ కేసులలో దర్యాప్తు న్యాయబద్ధంగా.. పారదర్శకంగా చేయాలని కూడా హైకోర్టు చెప్పింది.
ఈ క్రమంలోనే తాజాగా తీన్మార్ మల్లన్నకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. సోమవారం సాయంత్రం మల్లన్న జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు మొత్తం 38 కేసులు నమోదయ్యాయి. వాటిలో 6 కేసులను హైకోర్టు కొట్టివేయగా…మిగతా 32 కేసులో 31 కేసులకు బెయిల్ మంజూరైంది. మల్లన్న గత 74 రోజులుగా జైల్లో ఉన్నారు. మరోవైపు, తన భర్తపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మల్లన్న భార్య ఇటీవల హోంమంత్రి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేశారు.
ఈ కేసుల విషయంలో తెలంగాణ హైకోర్టుతో పాటు జాతీయ బీసీ కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా మల్లన్నకు బెయిల్ మంజూరు కావడం విశేషం. సీఎం కేసీఆర్ ను విమర్శించిన నేపథ్యంలోనే మల్లన్నపై కక్ష సాధిస్తున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.