మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు నిన్న మొన్నటి వరకు రాజకీయంగా మాత్రమే చిక్కులు వచ్చాయని అందరూ అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఆర్థికంగా ఆయన పెద్ద ఊబిలోనే కూరుకున్నారని తెలుస్తోంది. రాజకీయంగా.. గంటా కొన్నాళ్లుగా డోలాయమానంలో ఉన్నారు.
టీడీపీ తరఫున విశాఖ ఉత్తరం నియోజక వర్గం నుంచి గెలుపు గుర్రం ఎక్కినా.. అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపాలని అనుకున్నారు. కానీ, మంత్రి పదవి విషయంలో కుదరని రాజీ.. గంటాను ఏకాకిని చేసింది. ఇటు టీడీపీకి దూరమయ్యారు.
ఇటీవల పార్టీ పదవుల్లో ముక్కపచ్చలారని నాయకులకు కూడా చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు. కానీ, గంటా శ్రీనివాసరావు వంటి ప్రజా క్షేత్రంలో ఎక్కడైనా గెలుపు గుర్రం ఎక్కగలిగే.. బలమైన నాయకుడికి మాత్రం ఇవ్వకపోవడం గమనార్హం. ఇక, పార్టీలోనూ నేతలు ఆయనకు దూరంగా ఉంటున్నారు.
కేవలం తన వర్గం గా పేరున్న వారు మాత్రమే ఆయన చుట్టూ తిరుగుతున్నారు తప్ప.. మిగిలినవారిలో ఎవరూ కూడా గంటా ను పట్టించుకోవడం లేదు. ఇంకోవైపు.. వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే వచ్చి.. రద్దయింది. ఈ పరిణామాలు.. గంటా రాజకీయాలను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. పెడుతున్నాయి కూడా. ఎటూ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిని కల్పించాయి.
తాజాగా.. ఆర్థికంగా కూడా గంటాకు తీవ్ర కష్టాలు ఎదురయ్యాయి. ఇండియన్ బ్యాంకుకు రుణం ఎగవేత వ్యవహారంలో గంటా ఆస్తులను బ్యాంకు వేలం వేసేందుకు రెడీ అవడం.. ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ప్రత్యూష కంపెనీలో గంటా శ్రీనివాసరావు కూడా ఒకప్పుడు డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ బ్యాంకు నుంచి ఈ కంపెనీ రూ. 141 కోట్లను అప్పుగా తీసుకుంది.
ఇది.. గత చంద్రబాబు హయాంలోనే జరగడం గమనార్హం. అయితే, ప్రభుత్వానికి సంబంధం లేకపోయి నా.. మంత్రిగా గంటా ప్రభావితం చేశారనే విమర్శలు ఉన్నాయి. అయితే, ఈ రుణం చెల్లింపులో ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా సంస్థ చేతులు ఎత్తేసింది. దీంతో వడ్డీ సహా రూ.248.03 కోట్ల మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు బ్యాంకు సిద్ధమైంది. ఈ క్రమంలో విశాఖ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో బ్యాంకు గ్యారెంటీగా పెట్టిన ఆస్తులను ఈ నెల 25న వేలం వేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన ఇ–ఆక్షన్ సేల్ నోటీసును కూడా బ్యాంకు జారీ చేసింది.
ఇక, ఈ గ్యారెంటీల్లో మాజీ మంత్రి గంటా ఆస్తులు కూడా ఉన్నాయి. గంటా శ్రీనివాసరావు పేరుతో విశాఖలోని బాలయ్యశాస్త్రి లేఅవుట్లో త్రివేణి టవర్స్‌లోనున్న ఫ్లాట్, అదేచోట పి.రాజారావు పేరుతో ఉన్న 444 చదరపు గజాల విస్తీర్ణంలోనున్న మరో ఫ్లాట్ (వీటి విలువ రూ.1.50 కోట్లు) ను బ్యాంకు ఆక్షన్ వేయనుంది. అదేవిధంగా ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా సంస్థకు హైదరాబాద్‌లోని మణికొండలోని ల్యాంకో హిల్స్‌లో ఉన్న ఫ్లాట్ (రూ.2.47 కోట్లు) గంటాకు చెందినవే కావడం గమనార్హం. దీంతో ఆయనపై ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశంతోపాటు . రాజకీయంగా కూడా పెను మచ్చగా ఇది మిగిలిపోతుందని అంటున్నారు పరిశీలకులు.