సంచలన విజయాన్ని సాధించిన ‘బేబీ’ మూవీపై కొత్త వివాదం తాజాగా తెర మీదకు వచ్చింది. తాను చెప్పిన కథను విని.. కొన్నేళ్ల తర్వాత సినిమాగా తీసినట్లుగా ఆరోపిస్తూ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కంప్లైంట్ ను కేసుగా నమోదు చేసిన పోలీసుల కథనం ప్రకారం.. షార్ట్ మూవీస్ దర్శకుడు.. సినిమాటోగ్రాఫర్ శిరిన్ శ్రీరామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం 2013లో తన సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేయాలని శిరిన్ శ్రీరామ్ ను సాయి రాజేశ్ ను కోరారు. 2015లో శ్రీరామ్ ఒక కథ రాసుకున్నాడు. దానికి ‘‘కన్నా ప్లీజ్’’ అనే టైటిల్ పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆ కథకు ‘ప్రేమించొద్దు’ అన్న టైటిల్ పెట్టుకున్నారు.
సాయి రాజేశ్ సూచనతో నిర్మాత శ్రీనివాస కుమార్ నాయుడుకు శిరిన్ శ్రీరామ్ కథను వినిపించారు. 2023లో సాయి రాజేశ్ దర్శకత్వంలో శ్రీనివాస కుమార్ నాయుడు నిర్మాతగా.. ధీరజ్ సహ నిర్మాతగా ‘బేబీ’ మూవీ తీశారు. అయితే.. గతంలో తాను చెప్పిన ‘ప్రేమించొద్దు’ కథ.. బేబీ మూవీ కథ ఒక్కటేనని శ్రీరామ్ వాదన. తాజాగా రాయదుర్గం పోలీసులకు కంప్లైంట్ చేసిన నేపథ్యంలో.. ప్రాథమిక వివరాల ఆధారంగా కేసు నమోదు చేవారు. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు.. .. మోసానికి పాల్పడినందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీరామ్ పోలీసుల్ని ఆశ్రయించారు.