తెలంగాణ ఎన్నికల్లో ఆందోల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ప్రముఖ నటుడు బాబూ మోహన్ చుట్టూ రాజకీయ దుమారం రేగింది. ఇక్కడ నుంచి ఆయన కుమారుడు ఉదయ్ మోహన్ టికెట్ ఆశించారు. ఇద్దరూ కూడా ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నారు. ఉన్నత విద్య చదివిన ఉదయ్ మోహన్ .. బీజేపీ ఐటీ విభాగంలో సమన్వయ కర్తగా ఉన్నాడు. ఈ క్రమంలోనే నామినేషన్ల ముందు వరకు కూడా.. తన తండ్రికి వయసై పోయిందని.. తనకుటికెట్ కావాలని ప్రచారం చేశారు.
అయితే.. ఇదే తనకు చివరి ఎన్నికలని.. తనకే టికెట్ ఇవ్వాలని బాబూ మోహన్ పట్టుబట్టారు. మొత్తానికి బాబూ మోహన్ ఆశలు ఫలించి బీజేపీ టికెట్ ఆయనకే ఇచ్చింది. దీంతో ప్రచారం ప్రారంభించారు. అయితే.. అనూహ్యంగా ఉదయ్ మోహన్ ప్లేటు ఫిరాయించారు. తనకు టికెట్ దక్కలేదన్న నెపంతో పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. బీఆర్ ఎస్‌లో చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
మంత్రి హరీష్‌రావుతో ఉన్న పరిచయాల నేపథ్యంలో ఉదయ్.. ఎన్నికలకు ముందు బీఆర్ ఎస్ తీర్థం తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి హరిష్ సహా కీలక నేతల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని.. కేసీఆర్ కూడా ఓకే చెప్పారని సమాచారం. అయితే.. ఇలా అనూహ్య నిర్ణయం వెనుక బాబూ మోహన్ రాజకీయం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని.. అందుకే.. ముందుగానే బీఆర్ ఎస్‌లోకి తన కుమారుడిని పంపుతున్నారంటూ.. స్థానిక బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఉదయ్ మోహన్ ఎప్పుడైతే.. బీజేపీ నుంచి బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారో.. ఆ వెంటనే స్థానిక బీజేపీ నాయకులు బాబూమోహన్ ప్రచారానికి రావడం మానేశారు. నిజానికి ఇప్పటికే ప్రచారంలో వెనుకబడిన బాబూమోహన్‌కు ఇది మరింత ఇబ్బందికరంగా మారింది. మొత్తానికి చాలా వ్యూహాత్మకంగా బాబూ మోహన్ అడుగులు వేస్తున్నారనే చర్చ అయితే సాగుతుండడం గమనార్హం.