అవును డబ్బులు సంపాదించటమే కాదు. దాన్ని అవసరమైనపుడు అందులోను కష్టాల్లో ఉన్నపుడు ఖర్చుచేయాలన్న పెద్ద మనసు కూడా ఉండాలి. అవసరమైనవాళ్ళని ఆదుకునే విషయంలో తనది పెద్ద మనస్సే అని నందమూరి నటసింహం బాలకృష్ణ చాటుకున్నాడు. హైదరాబాద్ వరద బాధితుల సహాయార్ధం బాలయ్య బాబు కోటిన్నర రూపాయలు విరాళంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీయార్ మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవటానికి ఆర్ధికసాయం చేయమని కోరారు. దానికి పలువురు సానుకూలంగా స్పందిస్తున్నారు.
గడచిన ఆరేళ్ళుగా తెలంగాణాలోని భారీ ఇరిగేషన్ ప్రాజెక్టలు నిర్మిస్తున్న మేఘా ఇంజనీరింగ్ కంపెనీ కూడా స్పందించింది. సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 10 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. అలాగే తమిళనాడు ప్రభుత్వం కూడా పెద్ద మనసుతో రూ. 10 కోట్లను ప్రకటించింది. ఇలా చాలా కంపెనీలు, సంస్ధలు, పరిశ్రమలు పెద్ద ఎత్తునే విరాళాలు ప్రకటిస్తున్నాయి. ఎందుకంటే ప్రకృతి విపత్తులు వచ్చినపుడు తలోచేయి వేస్తేకానీ బాధితులకు సాయం అందదు. అన్నింటినీ ప్రభుత్వాలే చూసుకోవాలని అంటే అన్నీ సమయాల్లోను సాధ్యంకాదు. ఇలాంటపుడు అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు స్పందించాలి.
సంస్ధలు, పరిశ్రమలు, ప్రభుత్వాలు స్పందించటం ఓ ఎత్తు వ్యక్తులు స్పందించి భారీ ఎత్తున విరాళాలు ఇవ్వటం మరోఎత్తు. ఇప్పుడు బాలయ్యబాబు చేసిందిదే. వరద బాధితులను ఆదుకోవటంతో తనవంతుగా కోటిన్నర రూపాయలు ఇవ్వటం మామూలు విషయం కాదు. పైగా తాను కోటిన్నర రూపాయల విరాళం ఇచ్చినట్లు తనకు తానుగా ఎక్కడా ప్రకటించుకోలేదు. ఆమధ్య కరోనా వైరస్ వచ్చిన కొత్తల్లో కూడా తెలుగు ప్రభుత్వాలకు చెరో 10 లక్షల రూపాయలు ప్రకటించారు.
నిజానికి సినీప్రముఖుల నుండి తొందరగా స్పందన కనిపించదనే ఆరోపణలున్నాయి. తమిళనాడు, కర్నాటక, హిందీ సినీ ఫీల్డుల తరపున హీరోలు, హీరోయిన్లు కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణకు భారీ ఎత్తున విరాళాలు వచ్చినా తెలుగు ఫీల్డు నుండి ముఖ్యమంత్రి సహాయ నిధికి వచ్చింది తక్కువే. కాకపోతే సినీఫీల్డులోని వాళ్ళకోసం మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ఓ ఫండ్ రైజ్ చసి ఏవో కొంతసాయం చేసిందంతే. ఏమైనా పదిమందికి సాయం చేయాలంటే పెద్ద మనస్సుండాల్సిందే.