“జైలుకు వెళ్లి వచ్చిన సీఎం జగన్ కు పోలీసులు కాపలాగా ఉండాలా? ఆయనేమన్నా పై నుంచి దిగి వచ్చాడా? జేబు దొంగకు.. సీఎం జగన్కు తేడాలేదు“ అని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో జరిగిన బీసీ ఐక్య కార్యాచరణ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2500 మంది పోలీసులు లేనిదే జగన్ బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాడంటూ.. ఎద్దేవా చేశారు. జైలుకు వెళ్లి వచ్చిన సీఎంకు పోలీసులు కాపలా ఎందుకు అని ప్రశ్నించారు. వైసీపీ సెంటిమెంట్ చర్లపల్లి జైలుకు వెళ్లిరావడమేనని అన్నారు.
మంత్రి అంబటి రాంబాబుకు పోలవరంపై అవగాహన లేదని విమర్శించారు. ఏపీలో బీసీ మంత్రుల పేర్లు ఎంతమందికి తెలుసునని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. నాలుగేళ్లలో రూ.45 వేల కోట్లు విలువ చేసే ప్రైవేట్ భూములు బలవంతంగా లాక్కున్నారని అయ్యన్నఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాలను సీఎం జగన్ రూ.25 వేల కోట్లకు బ్యాంకుల్లో తాకట్టు పెట్టారని ఆరోపించారు. చివరికి బ్రాందీ షాపులను కూడా బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారని.. తనకు తెలిసి.. ఇంత మంచి రికార్డు ఉన్న ముఖ్యమంత్రులు లేరన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో మద్యం షాపులు బంద్ అని జగన్ పాదయాత్రలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా అయ్యన్న గుర్తు చేశారు. ఒక్క మాట నిలబెట్టుకోలేదని, అబద్దాలతో రాష్ట్ర ప్రజలను జగన్ మోసం చేసిన దుర్మార్గుడని అన్నారు. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతున్నందుకు టీడీపీ నేతలపై కేసులు పెట్టి.. జైలుకు పంపుతున్నా రని తీవ్రస్థాయిలో విమర్శించారు.
తనపై ఏకంగా 14 కేసులు పెట్టారని అన్నారు. కాకపోతే ఒక కేసు విషయంలో బాధపడ్డాన న్నారు. ఈ వయసులో తనపై రేప్ కేసు పెట్టారని, లేస్తే.. కూర్చోలేను.. కూర్చుంటే లేవలేను.. నేను రేప్ చేస్తానా? అని ప్రశ్నించి నవ్వులు పూయించారు. “లేస్తే.. కూర్చోలేను, కూర్చుంటే లేవలేను.. నేను రేప్ చేశానని జగన్ రెడ్డి చెబుతున్నాడు.. ఆయనేమైనా కాపలా ఉన్నాడా?“ అని ప్రశ్నించారు. ఇలాంటి దైర్భగ్యపరిపాలన రాష్ట్రంలో జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.